Telangana CEO: రాష్ట్ర శాసనసభకు షెడ్యూల్ ప్రకారం 2023 నవంబర్ ప్రాంతంలో ఎన్నికలు జరగాల్సి ఉంది. అంటే మరో 20 నెలల సమయం మాత్రమే ఉంది. ఎన్నికల సమయంలో రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి పాత్ర కీలకం. ఈ నేపథ్యంలో రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారిగా బాధ్యతలు ఎవరికి అప్పగిస్తారన్న విషయమై ప్రభుత్వ వర్గాల్లో విస్తృత చర్చ జరుగుతోంది.
ఎవరి వైపు మొగ్గుచూపుతుందో ?
ప్రస్తుతం సీఈవోగా ఉన్న శశాంక్ గోయల్... కేంద్ర సర్వీసుకు వెళ్లనున్నారు. కేంద్ర సర్వీసులోకి గోయల్‌ను తీసుకునేందుకు కేబినెట్ నియామకాల కమిటీ గత నెలలోనే ఆమోదం తెలిపింది. కేంద్ర కార్మిక, ఉపాధి కల్పన శాఖలో అదనపు కార్యదర్శిగా నియమించారు. దీంతో ఆయన స్థానంలో రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారిగా ఎవరు వస్తారన్న విషయమై భిన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి. సీనియర్ అధికారులు సునీల్ శర్మ, వికాస్ రాజ్, నవీన్ మిత్తల్, మహేష్ దత్ ఎక్కా సహా మరికొన్ని పేర్లు ప్రచారంలో ఉన్నాయి. అయితే రాష్ట్ర ప్రభుత్వం ఎవరి వైపు మొగ్గు చూపుతుందన్నది చూడాల్సి ఉంది.
ఇంకా రిలీవ్‌కాని గోయల్..
సీఈవో నియామకం కోసం ముగ్గురి పేర్లతో కూడిన ప్యానల్‌ను కేంద్ర ఎన్నికల సంఘానికి పంపాల్సి ఉంటుంది. అందులో ఒక పేరును ఈసీ ఖరారుచేసి రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారిగా నియమిస్తుంది. అయితే ప్రభుత్వం ఇంకా అటువంటి కసరత్తు ప్రారంభించలేదని తెలుస్తోంది. అటు శశాంక్ గోయల్ కూడా బాధ్యతల నుంచి ఇంకా రిలీవ్ కాలేదు. ఆయన రిలీవింగ్‌కు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని ప్రభుత్వ వర్గాలు అంటున్నాయి.
ఇదీచూడండి: 'పెగాసస్ స్పైవేర్ సమాచారం మా వద్ద లేదు'