Mortuaries Modernization: రాష్ట్రంలో మార్చురీల ఆధునికీకరణకు సర్కారు నడుం బిగించింది. పార్థివదేహాలను భద్రపరచటం సహా.. సరైన సదుపాయాల మధ్య పోస్ట్‌మార్టం నిర్వహించేందుకు వీలుగా మార్చురీలను తీర్చిదిద్దాలని నిర్ణయించింది. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా 113 చోట్ల మార్చురీలు ఉండగా.. అందులో ప్రాథమికంగా 61 మార్చురీలను మెరుగుపరచేందుకు 32.54 కోట్ల నిధులను మంజూరు చేసింది. ఇందులో టీచింగ్ ఆసుపత్రుల్లోని పది మార్చురీల ఆధునికీకరణకు 11.12 కోట్లు, తెలంగాణ వైద్య విధాన పరిషత్ పరిధిలోని 51 దవాఖానాలకు 21.42 కోట్లు కేటాయించింది.
దవాఖానాల్లో నియామకాలు..
ఈ కార్యక్రమంలో భాగంగా హైదరాబాద్‌లోని ఉస్మానియా, ఫీవర్, చెస్ట్ ఆసుపత్రులతో పాటు మహబూబ్‌నగర్, నల్గొండ సూర్యాపేట, సిద్దిపేట, నిజామాబాద్, వరంగల్, ఆదిలాబాద్ బోధనాసుపత్రుల్లోని మార్చురీలు కొత్త రూపు దిద్దుకోనున్నాయి. త్వరలో రాష్ట్రంలోని అన్ని మార్చురీ కేంద్రాల్లో ఫోరెన్సిక్ నిపుణులను నియమించాలని సర్కారు నిర్ణయించింది. ఇందులో భాగంగా వైద్యవిధాన పరిషత్తు దవాఖానాల్లో 63 సివిల్ అసిస్టెంట్ సర్జన్లు, 20 డీసీఎస్, 19 సీఎస్ పోస్టులు కలిపి 102 ఫోరెన్సిక్ నిపుణుల పోస్టులు మంజూరు చేసింది. మృతదేహాల తరలింపు కోసం సైతం ప్రస్తుతం 50 వాహనాలు అందుబాటులో ఉండగా మరో 16 నూతన వాహనాలను ప్రారంభించనున్నట్టు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు ప్రకటించారు.
ఇదీ చదవండి : Vinod Kumar allegations on BJP: ఎన్నికలు జరిగే రాష్ట్రాలకే బడ్జెట్లో నిధులు: వినోద్‌కుమార్