కరోనా వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో ప్రభుత్వం అప్రమత్తమైంది. ఈ మేరకు నిబంధనలను మరింత కఠినతరం చేస్తోంది. నిబంధనలను అతిక్రమించిన వారికి జరిమానాలు విధించనుంది. జీహెచ్ఎంసీ, ట్రాఫిక్ పోలీసులు... మాస్కులు ధరించని వారిపై కొరఢా ఝుళిపించనున్నారు. ఇందుకోసం నేటి నుంచి ప్రత్యేక డ్రైవ్‌లు చేపట్టనున్నారు.
కారులో ప్రయాణించే వారు కూడా..
కారులో ప్రయాణించే వారు కూడా విధిగా మాస్కు ధరించాల్సిందేనని పోలీసులు వెల్లడించారు. సైబరాబాద్, రాచకొండ, హైదరాబాద్ పోలీసు కమిషనరేట్ల పరిధిలో విధులు నిర్వహించే ట్రాఫిక్ పోలీసులు... మాస్కు లేకుండా వాహనాలపై వెళ్తున్న వారి ఫోటోలు తీసి ఈ-చలాన్‌లను పంపించనున్నారు. ఇప్పటికే మాస్కులు ధరించకుండా వాహనాలు నడుపుతూ వెళ్తున్న వారిపై 15 వేల కేసులు నమోదు చేశారు.
సీసీటీవీ కెమెరాలు కీలకం..
మాస్కులు లేకుండా వాహనాలు నడుపుతున్న వారిని గుర్తించడానికి కూడళ్లు, ట్రాఫిక్ సిగ్నళ్ల వద్ద ఏర్పాటు చేసిన సీసీటీవీ కెమెరాలు కీలకం కానున్నాయి. ట్రాఫిక్ సిగ్నళ్ల వద్ద వాహనాలు ఆగిన సమయంలో ఈ కెమెరాల నుంచి తప్పించుకొనే వీలు ఉండదు. ఈ దృశ్యాలు క్షణాల్లో ట్రాఫిక్ కమాండ్ కంట్రోల్ కేంద్రానికి చేరుతాయి. ప్రధానంగా కార్లు, బస్సులు, ద్విచక్ర వాహనాలపై దృష్టి కేంద్రీకరించనున్నారు. రోజురోజుకూ కరోనా వ్యాప్తి చెందుతున్న క్రమంలో నిబంధనలను ప్రతి ఒక్కరూ పాటించాలని ఉన్నతాధికారులు సూచిస్తున్నారు.
ఇవీచూడండి: బయోటెక్ కంపెనీలతో సీఎస్ఐఆర్- ఐఐసీటీ ఒప్పందం