మహారాష్ట్ర పాల్ఘార్ జిల్లాలోని ఓ ప్రైవేటు ఆసుపత్రి ఐసీయూలో ఘోర అగ్నిప్రమాదం సంభవించి 14 మంది మృత్యువాత పడడంతో తెలంగాణ విపత్తు స్పందన, అగ్నిమాపక సేవల శాఖ అప్రమత్తమైంది. రాష్ట్రంలో కొవిడ్ రోగులకు సేవలందిస్తున్న ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రుల్లోని ఐసీయూల పనితీరుపై ఆరా తీస్తోంది.
రాష్ట్రవ్యాప్తంగా 111 ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రులు కొవిడ్ రోగులకు అత్యవసర సేవలందిస్తున్నాయి. వాటిలోని పరిస్థితులపై ఇప్పటికే అగ్నిమాపక సేవల శాఖ నివేదిక రూపొందించింది. ఈ శాఖ అధికారులు బృందాలుగా ఏర్పడి నెల రోజుల క్రితం ఆసుపత్రులన్నిటినీ సందర్శించి లోటుపాట్లపై వివరాలు సేకరించారు. సవ్యమైన పరిస్థితులు లేని ఆసుపత్రులపై నివేదికలను ఆయా డీఎంఅండ్‌హెచ్‌వోలతోపాటు వైద్యారోగ్యశాఖ ఉన్నతాధికారులకు అందించారు.
తాజాగా మహారాష్ట్రలో దుర్ఘటన చోటుచేసుకోవడంతో మరోసారి ఆసుపత్రుల్లోని తాజా పరిస్థితులపై వాకబు చేశారు. వాస్తవానికి గతంతో పోల్చితే ఆసుపత్రుల ఐసీయూల్లో పడకలకు డిమాండ్ విపరీతంగా పెరిగింది. ఐసీయూల్లో వైద్య ఉపకరణాలు, ఎలక్ట్రానిక్ గాడ్జెట్ల వినియోగం పెరగడంతో విద్యుత్తు సరఫరాపై లోడ్ పెరిగి షార్ట్‌సర్క్యూట్లు జరిగే అవకాశముందని భావిస్తున్నారు. మరోవైపు వేసవి దృష్ట్యా అగ్నిప్రమాదాలకు ఆస్కారముండటం ఆందోళన కలిగించే అంశంగా మారింది. ఈ క్రమంలో ఇప్పటికే గుర్తించిన ఆసుపత్రుల నిర్వాహకులు అప్రమత్తంగా ఉండాలని ఉన్నతాధికారులు సూచించారు.