ప్రభుత్వ ఉద్యోగులకు ముఖ్యమంత్రి కేసీఆర్ కొత్త ఏడాది కానుక ప్రకటించారు. రాష్ట్రంలోని అన్నిరకాల ప్రభుత్వ ఉద్యోగులకు వేతనాలు పెంచాలని, ఉద్యోగ విరమణ వయసును పెంచాలని సీఎం నిర్ణయించారు. పెన్షనర్లు సహా 9,36,976 మందికి వేతనాల పెంపు వర్తిస్తుందన్నారు. ఆర్టీసీలో కూడా వేతనాలను పెంచాలని నిర్ణయించినట్లు తెలిపారు. అవసరమైతే వేతనాల పెంపువల్ల ఆర్టీసీపై పడే భారాన్ని ప్రభుత్వం భరిస్తుందని ప్రకటించారు. వేతనాల పెంపు, ఉద్యోగ విరమణ వయసు పెంపు సహా ఉద్యోగసంబంధ అంశాలన్నింటినీ ఫిబ్రవరిలోగా సంపూర్ణంగా పరిష్కరిస్తామని ముఖ్యమంత్రి తెలిపారు.
త్రిసభ్య సంఘం
అన్నిశాఖల్లో ఖాళీలను గుర్తించి ఫిబ్రవరి నుంచి ఉద్యోగ నియామకాల ప్రక్రియను చేపట్టనున్నట్లు కేసీఆర్ ప్రకటించారు. అన్ని అంశాలపై అధ్యయనం చేసి, ఉద్యోగ సంఘాలతో చర్చించేందుకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ అధ్యక్షతన త్రిసభ్య సంఘాన్ని నియమించారు. ఆర్థిక, నీటిపారుదలశాఖల ముఖ్య కార్యదర్శులు రామకృష్ణారావు, రజత్ కుమార్ కమిటీలో సభ్యులుగా ఉంటారు. జనవరి మొదటి వారంలో పీఆర్సీ నుంచి అందే నివేదికను అధ్యయనం చేయనున్న కమిటీ... రెండోవారంలో ఉద్యోగసంఘాలతో సమావేశం కానుంది. వేతన సవరణ, పదవీ విరమణ వయసు పెంపు, సర్వీసు నిబంధనలు, పదోన్నతులు, జోనల్ విధానంలో న్యాయపరమైన చిక్కులు అధిగమించడం లాంటి అంశాలపై కమిటీ ప్రభుత్వానికి సూచనలు చేయనుంది. ఆ తర్వాత మంత్రివర్గం వీటిపై తుదినిర్ణయం తీసుకోనుంది.
వాళ్ల పాత్ర ఎంతో గొప్పది
ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంలో ఉద్యోగుల పాత్ర ఎంతో గొప్పది. ఉద్యోగుల సంక్షేమం కోసం ప్రభుత్వం ఎన్నో చర్యలు తీసుకుంటోంది. తెలంగాణ ఏర్పడిన వెంటనే ఉద్యోగులకు 42శాతం ఫిట్మెంట్తో వేతనాలు పెంచాం. అన్ని రకాల ఉద్యోగులు, సిబ్బందికి కూడా వేతనాలు పెంచాం. మరోమారు అందరికీ వేతనాలు పెంచాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వానికున్న ఆర్థిక పరిమితుల మేర కచ్చితంగా ఎంతో కొంత వేతనాలు పెంచాలని ప్రభుత్వం నిర్ణయించింది.
- కేసీఆర్
ఆ హామీకి కట్టుబడి ఉన్నాం
ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ వయసు పెంచుతామన్న తెరాస ఎన్నికల హామీకి ప్రభుత్వం కట్టుబడి ఉందని ముఖ్యమంత్రి తెలిపారు. పదవీ విరమణ వయసు ఏ మేరకు పెంచాలనే విషయమై ఉద్యోగ సంఘాల నాయకులతో అధికారుల కమిటీ చర్చించాక ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని చెప్పారు. న్యాయవివాదాలను పరిష్కరించుకోవడంతో ఉద్యోగులకు సంబంధించిన అన్ని విషయాల్లో స్పష్టత వస్తోందని, ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఉద్యోగుల అంశాలను పరిష్కరించాలని సీఎం అన్నారు. జనవరి, ఫిబ్రవరి మాసాల్లో మొత్తం ప్రక్రియ పూర్తి చేసి మార్చి నుంచి ఉద్యోగులంతా అన్నిరకాల సమస్యల నుంచి శాశ్వతంగా విముక్తి కావాలని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు.
ఖాళీలు భర్తీ చేస్తాం
ఏపీతో వివాదం కారణంగా పోలీసు, రెవెన్యూ తదితర శాఖల్లో పదోన్నతులు ఇవ్వడం సాధ్యం కాలేదు. ఇప్పుడవన్నీ పరిష్కారం అయినందున వెంటనే అన్ని శాఖల్లో పదోన్నతులు ఇవ్వాలి. ఉద్యోగుల సర్వీసు నిబంధనలు సరళంగా ఉండాలి. పదోన్నతుల కోసం ఎవరివద్దా పైరవీ చేసే దుస్థితి ఉండొద్దు. నిర్ధిష్ట సమయానికి పదోన్నతుల ఉత్తర్వులు రావాలి. అన్నిశాఖల్లో వెంటనే డీపీసీలు నియమించాలి. పదోన్నతులు ఇవ్వగా ఖాళీ అయిన పోస్టులను వెంటనే భర్తీ చేయాలి. పదోన్నతుల అనంతరం శాఖలవారీగా ఖాళీలను గుర్తించి ఫిబ్రవరిలో ఉద్యోగ నియామకాల ప్రక్రియ ప్రారంభించాలి.
-కేసీఆర్
కారుణ్య నియామకాల్లో జాప్యం ఉండొద్దు
శాఖాధిపతులు ఉద్యోగుల సంక్షేమాన్ని కచ్చితంగా పట్టించుకోవాలని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. పదవీవిరమణ చేసే ఉద్యోగులను ఘనంగా సన్మానించి ప్రభుత్వ వాహనంలో ఇంటికి తీసుకెళ్లి గౌరవంగా వీడ్కోలు పలకాలని తెలిపారు. పదవీ విరమణ రోజే రిటైర్మెంట్ బెనిఫిట్స్ అన్నింటినీ అందించాలని స్పష్టం చేశారు. ప్రభుత్వ ఉద్యోగం చేస్తూ మరణించిన వారి కుటుంబ సభ్యులకు ఉద్యోగ అవకాశం కల్పించే కారుణ్య నియామకాల విషయంలో జాప్యం అత్యంత విషాదకరమని ముఖ్యమంత్రి అన్నారు. దు:ఖంలో ఉన్న కుటుంబం ఉద్యోగం కోసం కార్యాలయాల చుట్టూ తిరిగే అవసరం రాకూడదని స్పష్టం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని శాఖల్లో వెంటనే కారుణ్య నియామకాల ప్రక్రియను పూర్తి చేయాలని అధికారులను కేసీఆర్ ఆదేశించారు.
ఇదీ చదవండి: వ్యవసాయేతర భూముల రిజిస్ట్రేషన్లపై ప్రభుత్వం కీలక నిర్ణయం