‘‘కరోనా కట్టడి చర్యలు సఫలమవడంతోనే.. జీహెచ్‌ఎంసీలో ఇప్పుడు రోజుకు 250లోపు కేసులు నమోదవుతున్నాయి. 100లోపు కేసులు నిర్ధారణ అవుతున్న జిల్లాలు మూణ్నాలుగే ఉంటున్నాయి. గాంధీలో ఒక దశలో 900-1000 మంది రోగులు చికిత్స పొందుతుండేవారు. ప్రస్తుతం 350 మంది రోగులే ఉన్నారు. అయితే అక్టోబరు, నవంబరు, డిసెంబరు నెలలు అత్యంత కీలకం. ప్రజలు పండుగల కోసం షాపింగ్‌లకు, ఊర్లకు వెళ్లడం, బహిరంగ ప్రదేశాల్లో గుమిగూడటానికి అవకాశాలున్నాయి. ఇలాంటిచోట కరోనా వైరస్ దాడి చేయడానికి అవకాశం ఉంది.
కొవిడ్ నిర్ధారణ అవుతున్నవారిలో 70 శాతం మంది లక్షణాలు లేనివారే. అటువంటి వారు మనతో, మన మధ్యనే ఉంటూ ఇతరులకు వ్యాప్తి చేసే అవకాశం ఉంది. అందుకే అందరూ స్వీయ జాగ్రత్తలు తీసుకోవాలి. పండుగలు వస్తుంటాయి.. పోతుంటాయి. ప్రాణం పోతే మళ్లీ రాదు. కుటుంబ సభ్యుల మధ్యే పండుగను ఆనందంగా జరుపుకోవాలి’’ అని ఉన్నతాధికారులు సూచించారు. ఏ ఇబ్బందులున్నా 104 నంబరుకు ఫోన్ చేయాలని తెలిపారు. బార్లు, రెస్టారెంట్లు, పబ్‌లలో కొవిడ్ నిబంధనలు పాటించాలని, సిబ్బందికి కచ్చితంగా 7-10 రోజులకోసారి కరోనా నిర్ధారణ పరీక్షలు చేయించాలని స్పష్టంచేశారు.
మార్గదర్శకాలివీ..
- పండుగలు, ఉత్సవాల సమయంలో ప్రజలు కచ్చితంగా 6 అడుగుల దూరం పాటించాలి. ప్రసాద వితరణ, దర్శనాల్లో ఈ నిబంధనను అనుసరించాలి.
- మాస్కు లేకుండా ఎట్టి పరిస్థితుల్లోనూ బయటకు రావొద్దు.
- ప్రార్థన మందిరాల్లో చేతులను శానిటైజ్ చేసుకునేలా ఏర్పాట్లు చేయాలి.
- ఊరేగింపుల్లో పరిమితంగానే భక్తులను అనుమతించాలి.
- కంటైన్‌మెంట్ ప్రాంతాల్లో ఉత్సవాలను అనుమతించొద్దు.
- ఉత్సవ ప్రదేశాల్లో థర్మల్ స్క్రీనింగ్ ఏర్పాటు చేయాలి.
- బహిరంగ ప్రదేశాల్లో ఉమ్మి వేయొద్దు.