Minister Srinivas Goud on Paddy Procurement : తెలంగాణ రైతుల ప్రయోజనం కోసం దిల్లీకి వెళ్తే కేంద్ర మంత్రి తమను అవమానించారని రాష్ట్ర ఆబ్కారీ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఆరోపించారు. నెలరోజులుగా మంత్రులమంతా దిల్లీలో ఉన్నామని తెలిపారు. తెలంగాణ నేతలను భాజపా యాచకులుగా చూస్తోందని మండిపడ్డారు. కమలం నేతలకు రైతులకంటే రాజకీయ ప్రయోజనాలే ముఖ్యమని ఆరోపించారు.
Minister Srinivas Goud Comments on Central : ధాన్యం సేకరణ నుంచి తప్పించుకోవాలని కేంద్రం చూస్తోందని మంత్రి శ్రీనివాస్ మండిపడ్డారు. రైతుల కోసం అన్ని పార్టీలు ఏకమైన సందర్భాలు అనేకమని చెప్పారు. యాసంగిలో వరి వేయాలో వద్దో కేంద్రం స్పష్టంగా చెప్పాలని డిమాండ్ చేశారు. ధాన్యం సేకరణపై కేంద్రం హామీ లేఖ ఇస్తే.. కేంద్రం ఓడిపోయినట్లు కాదని అన్నారు.
Niranjan Reddy Comments : మరోవైపు దిల్లీ వెళ్లిన రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి కేంద్రంపై నిప్పులు చెరిగారు. కేంద్రం విధానాల వల్ల రైతులు బాధపడే పరిస్థితి వచ్చిందని మంత్రి నిరంజన్‌రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. జాతీయ రైతు దినోత్సవం సందర్భంగా.. దేశంలోని అన్నదాతలందరికీ మంత్రి శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ రైతుల పక్షాన ఆరు రోజులుగా దిల్లీలోనే ఉంటూ.. ధాన్యం కొనుగోళ్ల విషయంలో కేంద్రం స్పష్టత కోసం ఎదురుచూస్తున్నామని మంత్రి పేర్కొన్నారు. కానీ.. భాజపా నేతలు మాత్రం ఎలాంటి బాధ్యత లేకుండా.. అవహేళన చేస్తున్నారని మండిపడ్డారు.
Minister Jagadish Reddy Comments : రైతులను కేసీఆర్ నుంచి దూరం చేసేందుకు భాజపా కుట్ర చేస్తోందని మంత్రి జగదీశ్ రెడ్డి దిల్లీలో ఆరోపించారు. వానాకాలంలో పూర్తి ధాన్యం కొనుగోలు చేయాలని అడిగేందుకే దిల్లీలో ఉన్నామని స్పష్టం చేశారు. ఈ వానాకాలంలో 62 లక్షల ఎకరాల్లో వరి సాగైందన్న మంత్రి.. దాదాపు కోటి టన్నుల ధాన్యం దిగుబడి అయ్యిందన్నారు. కానీ.. కేంద్రం కేవలం 60 లక్షల టన్నుల ధాన్యమే తీసుకుంటానని చెప్పిందని గుర్తుచేశారు. ధాన్యం కొంటారో లేదో కేంద్రమంత్రి చెప్పకుండా పార్టీ నేతలతో తిట్టిస్తున్నారని మండిపడ్డారు.