రాష్ట్రంలో తెరాస ప్రభుత్వ వైఫల్యాలపై ఏప్రిల్ 1 నుంచి ప్రజాఉద్యమాలు చేపట్టనున్నట్టు పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఏఐసీసీ అగ్రనేత రాహుల్‌గాంధీని దిల్లీలో రాష్ట్ర కాంగ్రెస్ నేతల బృందం కలిసింది. పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, ఉత్తమ్, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, జానారెడ్డి, పొన్నాల, మధుయాస్కీ సహా 18 మంది కాంగ్రెస్ నేతల బృందం రాహుల్ గాంధీతో భేటీ అయింది. పార్టీ డిజిటల్ మెంబర్‌షిప్ వివరాలు రాహుల్ గాంధీకి అందించారు.
పార్టీ ప్రక్షాళన, అంతర్గత విభేదాలపై కూడా సమాలోచనలు జరిపారు. 25 నిమిషాల పాటు జరిగిన సమావేశంలో నేతల మధ్య పరస్పర సహకారంపై నేతలకు రాహుల్ దిశా నిర్దేశం చేశారు. ఏప్రిల్ 4న మరోసారి రాష్ట్ర నేతలతో రాహుల్ భేటీ కానున్నారు. ధాన్యం కొనుగోలు అంశంపై కేంద్ర, రాష్ట్రప్రభుత్వాల వైఖరిని జనంలోకి తీసుకెళ్తామని రేవంత్ తెలిపారు. ఇందుకోసం రాష్ట్రానికి రావాలని రాహుల్ గాంధీని కోరితే సానుకూలంగా స్పందించారని పేర్కొన్నారు.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నాటకాలు..
"ఏఐసీసీ ఆదేశాల మేరకు డిసెంబర్ 9 నుంచి మార్చి 30 వరకు సభ్యత్వ నమోదు కార్యక్రమం జరిగింది. 40 లక్షల క్రియాశీల సభ్యత్వాలు నమోదయ్యాయి. ఒక్కో కార్యకర్తకు 2 లక్షల బీమా కల్పించాం. న్యూ ఇండియా అష్యూరెన్స్ కంపెనీకి 6.34 కోట్ల చెక్కును రాహుల్ గాంధీ అందజేశారు. సభ్యత్వ నమోదులో నల్గొండ మొదటి స్థానం... పెద్దపల్లి రెండో స్థానంలో ఉంది. వరి ధాన్యం కొనుగోలు అంశంపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నాటకాలాడుతున్నాయి. వరి ధాన్యం కొనుగోలు అంశంపై రాష్ట్రంలో ఆందోళన చేపట్టాలని రాహుల్ గాంధీ సూచించారు. రాష్ట్రంలో ఉన్న అన్ని సమస్యలపై ఏప్రిల్ ఒకటి నుంచి ప్రజా ఉద్యమాలు చేపట్టాలని నిర్ణయించాం. రాష్ట్రంలో పర్యటించాలని రాహుల్ గాంధీని కోరాం." - రేవంత్‌రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు
ఇదీ చూడండి: