Padma shri Ramachandraiah: డోలు వాయిద్యంలో ప్రత్యేక ప్రతిభ చాటి పద్మశ్రీ అవార్డు సాధించిన కళాకారుడు సకిని రామచంద్రయ్యకు సీఎం కేసీఆఱ్ నజరానా ప్రకటించారు. ఆయన జిల్లా కేంద్రం కొత్తగూడెంలో నివాసయోగ్యమైన ఇంటిస్థలంతో పాటు నిర్మాణ ఖర్చుకు కోటి రూపాయల రివార్డును ప్రకటించారు. పద్మశ్రీ అవార్డు అందుకున్న నేపథ్యంలో రామచంద్రయ్య సీఎం కేసీఆర్ను ప్రగతిభవన్లో మర్యాదపూర్వకంగా కలిశారు.
అంతరించిపోతున్న ఆదివాసీ సాంస్కృతిక కళను బతికిస్తున్నందుకు ఆయన్ను అభినందించిన ముఖ్యమంత్రి.. జీవితకాలపు ప్రతిభకు గుర్తింపుగా ప్రతిష్ఠాత్మక పద్మశ్రీ అవార్డు పొందడం పట్ల శుభాకాంక్షలు తెలిపారు. రామచంద్రయ్య యోగ క్షేమాలు అడిగి తెలుసుకున్న సీఎం కేసీఆర్... ఇంటిస్థలం, నిర్మాణానికి సంబంధించి సమన్వయం చేసుకోవాలని ప్రభుత్వ విప్, పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావును ఆదేశించారు. నిరుడు పద్మశ్రీ అవార్డు అందుకున్న గుస్సాడీ నృత్య కళాకారుడు కనకరాజుకు తన స్థానిక జిల్లాకేంద్రంలో నివాసయోగ్యమైన ఇంటి స్థలాన్ని, నిర్మాణం ఖర్చుల కోసం కోటి రూపాయలను ముఖ్యమంత్రి ప్రకటించారు. ఇందుకు సంబంధించి సమన్వయం చేసుకోవాల్సిందిగా ఆసిఫాబాద్ ఎమ్మెల్యే ఆత్రం సక్కును ఆదేశించారు. ఇప్పటికే కిన్నెరమెట్ల కళాకారుడు మొగలియ్యకు నజరానా ఇచ్చిన విషయం తెలిసిందే.
ఇదీచూడండి: CM KCR Gift to Mogilayya: పద్మశ్రీ మొగిలయ్యకు సీఎం భారీ నజరానా..