Paddy Purchase in Telangana: యాసంగిలో ధాన్యం సేకరణ విషయమై కేంద్రానికి ఏం చెప్పాలనేది పౌరసరఫరాల శాఖకు సందిగ్ధంగా మారింది. యాసంగిలో వరి వేయవద్దని రాష్ట్ర ప్రభుత్వం రైతులకు స్పష్టం చేసినా సుమారు 31 లక్షల ఎకరాల్లో సాగైనట్లు వ్యవసాయ శాఖ రికార్డులు స్పష్టం చేస్తున్నాయి. గత ఏడాదితో పోలిస్తే వరి సాగు విస్తీర్ణం తగ్గినప్పటికీ ఇది పెద్దమొత్తమనే చెప్పాలి. కొన్ని ప్రాంతాల్లో నాట్లు వేసేందుకు నెలాఖరు వరకు గడువుందని వ్యవసాయ అధికారులు చెబుతున్నారు. కాస్త అటూఇటుగా 35 లక్షల ఎకరాల్లో వారు సాగు కావచ్చని అంచనా వేస్తున్నారు. అన్నీ అనుకూలిస్తే సుమారు 70 లక్షల మెట్రిక్ టన్నుల వరకు ధాన్యం దిగుబడి వస్తుంది. అందులో 40 నుంచి 50 శాతం వరకు వ్యాపారులు కొనే అవకాశం ఉంటుంది. మిగిలిన బియ్యం పరిస్థితి ఏమిటన్నది ప్రశ్న.
Telangana Paddy Purchase Issue : యాసంగిలో తేమ అధికంగా ఉండటంతో ఉప్పుడు బియ్యంగానే మార్చాల్సి వస్తుంది. మరోవైపు కేంద్రం ఉప్పుడు బియ్యం తీసుకునేది లేదని ఇప్పటికే తేల్చి చెప్పింది. గత యాసంగిలో భారీగా దిగుబడి రావటంతో ఆ సమస్య నుంచి బయటపడేందుకు వచ్చే యాసంగిలో ఉప్పుడు బియ్యం ఇవ్వబోమని రాష్ట్ర ప్రభుత్వం లిఖిత పూర్వకంగా హామీ ఇచ్చింది. యాసంగిలో ఏయే రాష్ట్రాల నుంచి ఎంత మొత్తంలో బియ్యం సేకరించాలన్న అంశంపై కేంద్రం ఈ నెల 25న అన్ని రాష్ట్రాలతో సమావేశం ఏర్పాటు చేసింది. ఆ తరవాతే ఏయే రాష్ట్రాలకు ఎంత నిధులు ఇవ్వాలి? ఎన్ని కోట్ల గోనె సంచులు కొనాలి? తదితర అంశాలపై కేంద్రం నిర్ణయం తీసుకుంటుంది. ప్రతి సీజనులో ధాన్యం సేకరణ సమయంలో 54 శాతం కొత్త గోనె సంచులను, 46 శాతం పాత వాటిని వినియోగించాలి. రాష్ట్రానికి సుమారు 16 కోట్ల వరకు సంచులు కావాలి, అందులో 8.5 కోట్ల వరకు కొత్త అవసరం. నూతన సంచులను కేంద్రమే అందచేస్తుంది. గత సీజనులో కొన్న కొత్త సంచులు కొన్ని ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. ఆయా అంశాలపై ప్రణాళిక కోసం రాష్ట్రాల నుంచి కేంద్రం సాగు సమాచారాన్ని కోరింది. ఇక్కడే అధికారులు అయోమయంలో పడ్డారు. ఏమి సమాచారం ఇవ్వాలో మార్గదర్శనం చేయాల్సిందిగా వారు రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాసినట్లు సమాచారం.
- ఇదీ చూడండి : పంటల సాగులో భారీగా పెరుగుతోన్న రసాయన ఎరువుల వాడకం