గతేడాది ఖరీఫ్‌లో 47.8 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనగా.. ఈ వానాకాలంలో ఇప్పటివరకే 47.87 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసినట్లు పౌరసరఫరాల సంస్థ ఛైర్మన్ మారెడ్డి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. 11 లక్షల మంది రైతుల నుంచి 6,505 కొనుగోలు కేంద్రాల ద్వారా 9 వేల కోట్ల రూపాయలు విలువ చేసే ధాన్యాన్ని కనీస మద్ధతు ధరకు కొనుగోలు చేశామని వెల్లడించారు. 8,375 కోట్ల రూపాయలు నేరుగా రైతుల ఖాతాలో జమ చేశామని ప్రకటించారు.
హైదరాబాద్ ఎర్రమంజిల్‌లో పౌరసరఫరాల సంస్థ ఉద్యోగుల సంఘం డైరీని ఆవిష్కరించిన శ్రీనివాస్ రెడ్డి.. దారిద్ర రేఖకు దిగువన ఉన్న అర్హులైన ప్రతి ఒక్కరికి ఆరు కిలోల చొప్పున బియ్యం కిలో రూపాయికే సరఫరా చేస్తున్నామని తెలిపారు. ప్రతి నెల 87.54 లక్షల కుటుంబాలకు 1.75 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం సరఫరా చేస్తున్నామన్న ఆయన... నాణ్యతలో రాజీపడకుండా ఏటా ప్రభుత్వ సంక్షేమ వసతి గృహాలు, పాఠశాలలకు మధ్యాహ్న భోజన పథకం కింద లక్షా 20 వేల మెట్రిక్ టన్నుల బియ్యం అందజేస్తున్నామని వెల్లడించారు.
- ఇదీ చూడండి : ఉరివేసుకొని ఎస్సై ఆత్మహత్య... కారణం అదేనా!