పట్టణ ప్రాంతాల్లో ఆస్తుల వివరాలను నమోదు చేసేందుకు పురపాలకశాఖ తీసుకొచ్చిన జియోస్పేషియల్ మ్యాపింగ్‌కు జాతీయస్థాయి గుర్తింపు లభించింది. పురపాలికలకు ఉన్న అన్ని ఆదాయ వనరులను అనుసంధానిస్తూ అమలు చేస్తున్న జియోస్పేషియల్ మ్యాపింగ్‌కు జనాగ్రహ సిటీ గవర్నెన్స్ అవార్డు లభించింది. ఉత్తమ రాష్ట్రం కేటగిరీలో తెలంగాణ సీడీఎంఏ రెండో స్థానంలో నిలిచింది.

కేంద్ర పట్టణాభివృద్ధిశాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి వర్చువల్ విధానంలో అవార్డులను అందించారు. పురపాలకశాఖ సంచాలకులు సత్యనారాయణ అవార్డు అందుకున్నారు. జియోస్పేషియల్ మ్యాపింగ్ కోసం నేషనల్ రిమోట్ సెన్సింగ్ కౌన్సిల్ సహకారంతో సీడీఎంఏ రూపొందించిన భువన్ యాప్‌లో ఆస్తిపన్ను, వ్యాపార అనుమతులు, నీటిపన్ను, ప్రకటనల పన్ను, సెల్ టవర్లు తదితర వివరాలు నమోదు చేశారు.
యాప్ ద్వారా ప్రజలు కూడా తమ ఆస్తులకు సంబంధించిన అన్ని వివరాలు చూసుకునే వెసులుబాటు ఉంది. ఇప్పటి వరకు భువన్ యాప్‌లో నాలుగు లక్షల ఆస్తుల వివరాలు నమోదు చేశారు.
ఇదీ చదవండి : హైదరాబాద్ కోఠిలోని శీతలీకరణ కేంద్రానికి కొవిషీల్డ్ టీకాలు