రాష్ట్ర మంత్రివర్గం రేపు సమావేశం కానుంది. ఆదివారం సాయంత్రం నాలుగు గంటలకు ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన ప్రగతి భవన్లో కేబినెట్ భేటీ కానుంది. పట్టణప్రగతి కార్యక్రమ నిర్వహణపైనే సమావేశంలో ప్రధానంగా చర్చ జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. గ్రామాల రూపురేఖలు మార్చే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి వరకు రెండు దఫాలుగా పల్లెప్రగతి కార్యక్రమాన్ని నిర్వహించింది. అదే తరహా కార్యక్రమాన్ని రాష్ట్రంలోని అన్ని పట్టణాలు, నగరాల్లోనూ నిర్వహిస్తామని సీఎం కేసీఆర్ ఇప్పటికే ప్రకటించారు.
పట్టణాలకు నిధులు
రాష్ట్రంలో పురపాలక ఎన్నికలు పూర్తై, కొత్త పాలకమండళ్లు కొలువుదీరడంతో పాటు నూతన కార్పొరేషన్లకు ఐఏఎస్ అధికారులను కమిషనర్లుగా నియమించారు. పట్టణ ప్రగతి కార్యక్రమ నిర్వహణకు సర్కార్ రంగం సిద్ధం చేసింది. ఇటీవల జరిగిన కలెక్టర్ల సమావేశంలోనూ ముఖ్యమంత్రి కేసీఆర్ పట్టణ ప్రగతి కార్యక్రమానికి అధిక ప్రాధాన్యం ఇచ్చారు. ప్రతి నెలా హైదరాబాద్ నగరానికి రూ.78 కోట్లు, ఇతర పట్టణాలు, నగరాలకు రూ.70 కోట్ల రూపాయలు నిధులు విడుదల చేస్తామని చెప్పారు.
పట్టణ ప్రగతి తేదీల ఖరారు!
స్థానిక సంస్థలపై అదనపు కలెక్టర్లు ప్రత్యేకంగా దృష్టి సారించాలని కోరారు. కేవలం స్థానిక సంస్థల కోసం నియమించిన అదనపు కలెక్టర్లకు ఇతర విధులు అప్పగించవద్దని స్పష్టం చేశారు. కలెక్టర్ల సదస్సు తర్వాత పంచాయతీరాజ్, పురపాలకచట్టాలపై అదనపు కలెక్టర్లకు ప్రత్యేక శిక్షణ ఇచ్చారు. వీటన్నింటి నేపథ్యంలో వీలైనంత త్వరగా పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని చేపట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. రేపు జరగనున్న మంత్రివర్గ సమావేశంలో పట్టణ ప్రగతిపైనే ప్రధానంగా చర్చించి కార్యక్రమ విధివిధానాలతో పాటు నిర్వహణ తేదీలను ఖరారు చేయనున్నారు.
మొదటి వారంలో బడ్జెట్ సమావేశాలు
జిల్లాల వారీగా ఈ నెల 25వ తేదీ వరకు పంచాయతీరాజ్ సమ్మేళనాలు నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే స్పష్టం చేసింది. ఆ తర్వాత పక్షం రోజుల పాటు గడువిచ్చి గ్రామాల రూపురేఖలు మార్చే లక్ష్యాన్ని నిర్దేశించాలని సీఎం స్పష్టం చేశారు. గడువు ముగిశాక తనతో పాటు ఫ్లయింగ్ స్క్వాడ్స్ ఆకస్మిక తనిఖీలు చేస్తాయని తెలిపారు. ఈ నేపథ్యంలో సమ్మేళనాలు, లక్ష్యాలపై ముఖ్యమంత్రి దిశానిర్దేశం చేయనున్నారు. బడ్జెట్ సమావేశాల నిర్వహణపై భేటీలో చర్చించే అవకాశం ఉంది. వచ్చే నెల మొదటి వారంలో బడ్జెట్ సమావేశాలు జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. కొత్త రెవెన్యూ చట్టం అంశం కూడా భేటీలో ప్రస్తావనకు వచ్చే అవకాశం ఉంది.
నీటిపారుదలపై ప్రత్యేక చర్చ!
సంయుక్త కలెక్టర్ల స్థానంలో అదనపు కలెక్టర్లను నియమించడంతో పాటు స్థానిక సంస్థలకు ప్రత్యేకంగా నియమించిన నేపథ్యంలో సంబంధించిన అంశాలపై చర్చ జరగనుంది. ఇందుకు సంబంధించి కొన్ని నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. రాష్ట్రంలోని నీటిపారుదల వ్యవస్థను 11 సర్కిళ్లుగా పునర్వ్యవస్థీకరించాలని కాళేశ్వరం పర్యటన సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశించారు. అందుకు అనుగుణంగా మంత్రివర్గంలో నిర్ణయాలు తీసుకోవచ్చని సమాచారం. కాళేశ్వరం నుంచి 530 టీఎంసీల నీటిఎత్తిపోత వ్యూహం, జూరాల పునరుజ్జీవనం కోసం అదనపు జలాశయ నిర్మాణం, ఇతర నీటిపారుదల అంశాలతో పాటు ఇతర పాలనాపరమైన అంశాలపై మంత్రివర్గంలో చర్చించే అవకాశాలు కనిపిస్తున్నాయి.
ఈచ్ వన్ టీచ్ వన్‌పై దిశానిర్దేశం
రాష్ట్రంలో సంపూర్ణ అక్షరాస్యత ధ్యేయంగా ఈచ్ వన్ టీచ్ వన్ కార్యక్రమంపై మంత్రులు, అధికారులకు సీఎం దిశానిర్దేశం చేసే అవకాశం ఉంది. పల్లెప్రగతి సందర్భంగా గ్రామీణ ప్రాంతాల్లో వయోజన నిరక్షరాస్యుల వివరాలను సేకరించిన ప్రభుత్వం... పట్టణాలు, నగరాల్లో పట్టణప్రగతి సందర్భంగా ఆ వివరాలు సేకరించే అవకాశం ఉంది. ప్రభుత్వ ప్రాధాన్య పథకాల అమలు తీరుతెన్నులపై మంత్రివర్గ సమావేశంలో సమీక్షించే అవకాశం ఉంది. నీటిపారుదల ప్రాజెక్టులు, రెండు పడకల గదుల ఇళ్లు, మిషన్ భగీరథ తదితరాలపై చర్చించడంతో పాటు ఇతర రాజకీయ, తాజా అంశాలు కూడా మంత్రివర్గ సమావేశంలో ప్రస్తావనకు వచ్చే అవకాశం ఉంది.
ఇదీ చూడండి: కేసీఆర్ కటౌట్... మంత్రి తలసానికి జరిమానా