రాష్ట్ర మంత్రివర్గం గురువారం సమావేశం కానుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన ఎల్లుండి మధ్యాహ్నం రెండు గంటలకు ప్రగతిభవన్లో కేబినెట్ భేటీ జరగనుంది. శాసనసభ సమావేశాల తేదీని భేటీలో ఖరారు చేసే అవకాశం ఉంది. ఈ నెల 25వ తేదీలోగా ఉభయసభలు సమావేశం కావాల్సి ఉంది. దీంతో ఆ లోగా సమావేశాలను ప్రారంభించేలా నిర్ణయం తీసుకోనున్నారు. సమావేశాల్లో ప్రవేశపెట్టే బిల్లుల అంశంపై కూడా చర్చ జరగనుంది.
దళితబంధు పథకంపై కూడా మంత్రివర్గ సమావేశంలో చర్చించే అవకాశం ఉంది. హుజూరాబాద్ నియోజకవర్గంతో పాటు మరో నాలుగు మండలాల్లో పైలట్ ప్రాజెక్టు అమలు చేయాలని నిర్ణయించారు. అందుకు కేబినెట్ ఆమోదముద్ర వేయనుంది. పంటలసాగు, వరి ధాన్యం సేకరణకు సంబంధించి కేంద్రం నిర్ణయం, సంబంధిత అంశాలపై చర్చ జరిగే అవకాశం ఉంది. ఉద్యోగాల భర్తీ అంశం కూడా ప్రస్తావనకు వచ్చే అవకాశం లేకపోలేదు.