రానున్న ఆర్థిక సంవత్సరానికి.... రాష్ట్ర వార్షిక బడ్జెట్ కసరత్తు కొనసాగుతోంది. వాస్తవికతను దృష్టిలో ఉంచుకొని ఖరారు చేయాలన్న సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు ఆర్థిక శాఖ అధికారులు పద్దు ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నారు. ప్రస్తుత ఏడాది ఆదాయ, వ్యయఅంచనాలు పరిగణలోకి తీసుకొని.. వచ్చేఏడాదికి సంబంధించి కసరత్తు చేస్తున్నారు. లాక్‌డౌన్ వల్ల భారీగా పడిపోయిన రాష్ట్ర ఆదాయం క్రమంగా కోలుకుంటోంది. డిసెంబర్, జనవరి వరకు సాధారణ స్థాయికి చేరుకున్నట్లు అధికార వర్గాలు చెబుతున్నాయి.
రుణపరిమితి పెంచినా...
ప్రస్తుత ఆర్థికసంవత్సరంలో ఆదాయం భారీగా పడిపోవడం వల్ల ఎక్కువగా అప్పులపై ఆధారపడాల్సి వచ్చింది. కీలకమైన పథకాలు, కార్యక్రమాలకు రుణాల ద్వారా నిధులు సమీకరించి అమలుచేశారు. రుణపరిమితి పెంపునకు కేంద్రం అనుమతించడం కాస్త కలిసొచ్చింది. ఐజీఎస్టీ సెటిల్మెంట్ సహా జీఎస్టీ బకాయిలు రావడం ఖజానాకు కొంత ఊరటనిచ్చింది. కానీ వచ్చే ఆర్థిక ఏడాదిలో ఆ పరిస్థితి ఉండదు. రుణపరిమితి 4 శాతానికి పెరిగినా... ప్రస్తుత ఆర్థిక ఏడాదిలో తీసుకున్న ఐదు శాతంతో పోలిస్తే తక్కువే. జీఎస్డీపీ ఆధారంగా రుణాలు తీసుకునే వెసులుబాటు ఉంటుంది.
తగ్గిన పన్నుల వాటా...
రానున్న ఆర్థిక సంవత్సరంలో రాష్ట్ర జీస్డీపీలో తగ్గుదల ఉంటుందని 15వ ఆర్థికసంఘం అంచనా వేసింది. కేంద్రబడ్జెట్‌లోనూ రాష్ట్రానికి అదనంగా ఏమీ రాకపోగా... రాయితీలు తగ్గాయి. పన్నుల వాటా తగ్గింది. 2021-22 ఆర్థిక సంవత్సరంలో రాష్ట్ర ప్రభుత్వానికి అదనపు వ్యయం తప్పనిసరిగా కనిపిస్తోంది. ఉద్యోగుల వేతనసవరణ, నిరుద్యోగ భృతి, కొత్త నియామకాలతో.. ఖజానాపై భారం పెరగనుంది. సాగునీటి ప్రాజెక్టుల నిర్వహణకు అదనంగా నిధులు కేటాయించేందుకు సర్కార్ సిద్ధమవుతోంది.
అదనపు వ్యయం తప్పనిసరి...
పంచాయతీల తరహాలోనే జిల్లా, మండల ప్రజాపరిషత్‌లకు బడ్జెట్‌లోనే నిధులు కేటాయిస్తామని సీఎం కేసీఆర్ ఇటీవల ప్రకటించారు. పక్కా ఇళ్ల నిర్మాణం, రుణమాఫీకి నిధులు కేటాయించాల్సి ఉంది. హైదరాబాద్ సహా పట్టణ ప్రాంతాల్లో పారిశుద్ధ్యం, నాలాల కోసం భారీ కార్యక్రమాలను సర్కారు తలపెట్టింది. అందుకు చాలా వ్యయం అవసరం కానుంది. కేంద్ర బడ్జెట్‌లో స్వచ్ఛభారత్‌కు నిధులు పెంచినందువల్ల....కొంత మేర నిధులు రాబట్టవచ్చని భావిస్తున్నారు. కొత్త ఆసరా ఫించన్లూ ఇస్తామని ముఖ్యమంత్రి ప్రకటించారు. వృద్ధాప్య ఫించన్ల అర్హతా వయస్సును 57ఏళ్లకు తగ్గిస్తామన్న హామీని అమలుచేస్తే లబ్ధిదారుల సంఖ్య మరింత పెరుగుతుంది.మిషన్ భగీరథ సహా ఇతరాల కోసం తీసుకున్న రుణాల వడ్డీల చెల్లింపులు చేయాల్సి ఉంది. మొత్తంగా రానున్న ఆర్థికసంవత్సరంలో అదనంగా నిధులొచ్చే అవకాశం కనిపించినా అదనపు వ్యయం మాత్రం తప్పనిసరిగా కనిపిస్తోంది.
ఆదాయ, వ్యయాలను పరిశీలించాక నిధుల సమీకరణ అత్యంత కీలకంగా మారింది. నిరుపయోగంగా ఉన్న భూముల అమ్మకం ద్వారా నిధులు రాబట్టుకోవాలని గత కొన్నేళ్లుగా ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. ఆ మేరకు బడ్జెట్‌లోనూ పొందుపరుస్తోంది. కానీ, వివిధ కారణాల రీత్యా అది సాధ్యం కావడం లేదు.