Telangana BJP Focus on SC Voters : తెలంగాణలో ఎస్సీ నియోజకవర్గాలపై భాజపా దృష్టి సారించింది. ఈ నియోజకవర్గాల్లో అభ్యర్థుల గుర్తింపు, పార్టీ బలోపేతానికి తీసుకోవాల్సిన చర్యలపై హైదరాబాద్లో భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అధ్యక్షతన సమావేశం జరిగింది. ఈ సమావేశానికి మాజీ మంత్రులు విజయరామారావు, చంద్రశేఖర్, బాబుమోహన్, మాజీ ఎంపీ వివేక్, ఎస్ కుమార్, బంగారు శ్రుతి తదితర నాయకులు హాజరయ్యారు.
BJP Focus on SC Constituencies in Telangana : రాష్ట్రంలోని 19 అసెంబ్లీ, 3 పార్లమెంట్ ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గాలపై భాజపా దృష్టి సారిస్తోందని బండి సంజయ్ తెలిపారు. దళితబంధుతో పాటు.. ఎస్సీ వర్గానికి ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన హామీల అమలు కోసం పోరాట ప్రణాళిక రూపొందిస్తామని చెప్పారు. 19 ఎస్సీ స్థానాల్లో విజయమే లక్ష్యంగా పనిచేయాలని నాయకులు, కార్యకర్తలకు బండి సూచించారు. మిషన్-19తో ముందుకెళ్లి విజయం సాధించాలని పిలుపునిచ్చారు. ఎస్సీ నియోజకవర్గాల్లో భాజపా సర్వే చేస్తే తెరాసపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైందని వెల్లడించారు
Bandi Sanjay On SC Constituencies : కాంగ్రెస్ పార్టీ ఎస్సీ వర్గాన్ని ఓటు బ్యాంకుగా చూసిందని బండి సంజయ్ ఆరోపించారు. అంబేడ్కర్ ఆలోచనా విధానంతో భాజపా ముందుకెళ్తోందని తెలిపారు. తెరాస కూడా ఎస్సీలకు అనేక హామీలు ఇచ్చి విస్మరించిందని చెప్పారు. ఎస్సీ వ్యతిరేక విధానాలు, హామీలపై పోరాటం చేస్తామని పేర్కొన్నారు.