కొవిడ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం మాస్కులు ధరించడాన్ని తప్పనిసరి చేసింది. ర్యాలీలు, ఉత్సవాలపై కూడా ఆంక్షలు విధించింది. బహిరంగ ప్రదేశాలు, పనిచేసే ప్రదేశాలు, ప్రజారవాణా వాహనాల్లో మాస్కులు కచ్చితంగా ధరించాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. ర్యాలీలు, ప్రజలు గుమిగూడడం, ఒకేచోట చేరడంపై కూడా ఆంక్షలు విధించింది. ఏప్రిల్ 30వ తేదీ వరకు ఎలాంటి ర్యాలీలు, ఉత్సవాలకు అనుమతి లేదని స్పష్టం చేసింది.
షబ్-ఏ-రాత్, హోలీ, ఉగాది, శ్రీరామనవమి, మహవీర్ జయంతి, గుడ్ ఫ్రైడే, రంజాన్ తదితర మతపరమైన పండుగలు, కార్యక్రమాల సందర్భంగా బహిరంగంగా ఎలాంటి ఉత్సవాలు, ర్యాలీలు నిర్వహించరాదని తెలిపింది. బహిరంగ ప్రదేశాలు, స్థలాలు, పార్కులు, మతపరమైన ప్రదేశాల్లో ఎలాంటి ఉత్సవాలు, ర్యాలీలు చేపట్టరాదని స్పష్టం చేసింది.
మాస్కులు ధరించని, నిబంధనలు ఉల్లంఘించిన వారిపై విపత్తు నిర్వహణా చట్టంలోని 51 నుంచి 60 సెక్షన్లు, ఐపీసీ 188వ సెక్షన్ కింద చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. ప్రభుత్వ నిర్ణయాలు విధిగా అమలయ్యేలా చూడాలని కలెక్టర్లు, పోలీస్ కమిషనర్లు, ఎస్పీలను ప్రభుత్వం ఆదేశించింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు.
ఇదీ చదవండి : యాదాద్రి ఆలయంలో 30 మందికి కరోనా పాజిటివ్