శాసనసభ వర్షాకాల సమావేశాలు వచ్చే నెల 7వతేదీ నుంచి నిర్వహించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించారు. కొత్త సచివాలయ నిర్మాణం, కరోనా నియంత్రణ చర్యలు, పలు బిల్లులు, తీర్మానాలు ప్రవేశపెట్టడంతో పాటు ప్రభుత్వ విధాన నిర్ణయాలకు సంబంధించిన ప్రకటనలు, రాష్ట్రాభివృద్ధికి సంబంధించిన అనేక కీలక అంశాలపై చర్చించి, నిర్ణయాలు తీసుకునేందుకు వీలుగా సమావేశాలు నిర్వహిస్తున్నట్టు తెలిపారు. సోమవారం ప్రగతి భవన్‌లో సీఎం పలువురు మంత్రులతో సమావేశమై శాసనసభ వర్షాకాల సమావేశాల నిర్వహణపై చర్చించారు.
20 రోజుల పాటు సమావేశాలు నిర్వహించడం వల్ల ముఖ్యమైన అంశాలపై సమగ్ర చర్చ జరిపే అవకాశం ఉంటుందని ఈ సందర్భంగా మంత్రులు అభిప్రాయపడ్డారు. కనీసం 15 రోజుల పనిదినాలైనా ఉండాలని సూచించారు. ఎన్నిరోజులు నిర్వహించాలనే అంశంపై శాసనసభ కార్యకలాపాల సలహా కమిటీ (బీఏసీ)లో తుది నిర్ణయం తీసుకోవాలని నిర్ణయించారు. తేదీ ఖరారు చేసినందున సమావేశాలకు సిద్ధంకావాలని మంత్రులను, అధికారులను సీఎం కేసీఆర్ కోరారు. కొవిడ్ నిబంధనలకు అనుగుణంగా, సభ్యులు భౌతిక దూరం పాటించేలా ఏర్పాట్లు చేయాలని శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి, శాసనసభ కార్యదర్శి నర్సింహాచార్యులకు సూచించారు.