యాసంగి సీజన్ నుంచి ధాన్యం కొనబోమని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. రైతులు వరికి బదులు ప్రత్యామ్నాయ పంటల వైపు మొగ్గుచూపాలని వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్ రెడ్డి సూచించారు. ఉప్పుడు బియ్యం కొనుగోలు చేయబోమని ఎఫ్‌సీఐ ఉత్తర్వులు జారీచేసిన దృష్ట్యా ఇక ఈ ఏడాది యాసంగితోపాటు రాబోయే రోజుల్లో రబీ సీజన్‌లోనూ వరిసాగు చేయవద్దని రైతులకు సూచించింది. ఆహార రంగాన్ని కార్పొరేట్ పరం చేసేందుకు కేంద్రం కుట్ర పన్నుతోందని మంత్రి నిరంజన్‌రెడ్డి ఆరోపించారు.
కాంగ్రెస్ ఫైర్..
వరి వేయొద్దన్న మంత్రి నిరంజన్‌రెడ్డి ప్రకటనను కాంగ్రెస్ నేతలు తీవ్రంగా ఆక్షేపించారు. రైతులను గందరగోళపరిచేలా మంత్రి వ్యాఖ్యలున్నాయని పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు. రైతులకు న్యాయం చేసేలా ప్రభుత్వమే ధాన్యం కొనుగోళ్లు చేయాలని మాజీ మంత్రి చిన్నారెడ్డి డిమాండ్ చేశారు.
రైతుల పక్షాన ఉద్యమిస్తాం..
రాష్ట్ర ప్రభుత్వం మెడలు వంచైనా... ధాన్యం కొనుగోళ్లు చేసేలా చూస్తామని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తేల్చిచెప్పారు. రైతుల పక్షాన ఉద్యమం చేస్తామని స్పష్టం చేశారు.
ధాన్యం కొనుగోలు విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఒకరిపై ఒకరు బురద చల్లుకుంటున్నాయని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి ఆరోపించారు. వడ్లు పండించకూడదని రైతులకు స్వేచ్ఛ లేకుండా చేస్తున్నారని మండిపడ్డారు.
ఇదీచూడండి: Revanth Reddy comments: కేసీఆర్‌కు మద్యం షాపులపై ఉన్న ప్రేమ.. రైతుల మీద లేదు