మిడతలకు సంబంధించి ప్రభుత్వానికి ఎలాంటి సమాచారం ఉంది?
ఇవి మహారాష్ట్ర వరకు మొట్టమొదటిసారి వచ్చాయి. మనం కూడా అప్రమత్తమయ్యాం. శాస్త్రవేత్తలు, నిపుణులు, జోధ్‌పూర్‌లోని మిడతల హెచ్చరికల కేంద్రాన్ని ఎప్పటికప్పుడు సంప్రదిస్తున్నాం. ఆదిలాబాద్, మంచిర్యాల, ఆసిఫాబాద్ వరకు వస్తే ఎలాంటి చర్యలు తీసుకోవాలో అధికారులను అప్రమత్తం చేశాం.
వాటి ప్రయాణ దిశ ఎలా ఉంది. రాష్ట్రానికి వచ్చే అవకాశం ఉందా?
జోధ్‌పూర్ హెచ్చరికల కేంద్రం చెప్పిన ప్రకారం రాజస్థాన్‌లో ఉన్నట్లు మూడు, నాలుగు కిలోమీటర్ల మేర పెద్దగా మిడతల దండు మహారాష్ట్రలో లేదు. ప్రతిరోజూ రాత్రి పూట దండు ఎక్కడో ఓ చోట ఆగుతుంది. అక్కడ నియంత్రణ చర్యలు చేపడుతున్నారు. దండు పరిమాణం తగ్గుతూ వస్తోంది. ప్రస్తుతం కిలోమీటరున్నర పరిమాణంలో ఉందని చెప్పారు. మహారాష్ట్రలో రామ్‌టెక్ నుంచి మధ్యప్రదేశ్ సరిహద్దులో ఉన్నట్లు తెలిసింది. నియంత్రణ చర్యలతో వాటి పరిమాణం ఇంకా తగ్గి మధ్యప్రదేశ్ వైపు వెళ్తుందని చెప్పారు.
వాటివల్ల పంటలకు ఏ మేరకు నష్టం జరుగుతుంది?
మహారాష్ట్రలోనూ ఇపుడు పంటలు లేవు. అదృష్టవశాత్తు మన దగ్గరా సాధారణ పంటలు లేవు. సరిహద్దు జిల్లాల్లో 36 వేల ఎకరాల్లో ఉద్యానవన పంటలున్నాయి. పంజాబ్ లాంటి రాష్ట్రాల్లో పత్తి మొలకలు మూడు, నాలుగు అంగుళాల ఎత్తులో ఉన్నాయి. అటువంటి వాటిని మిడతలు తినే అవకాశం ఉంటుంది. మన రాష్ట్రంలో విత్తేందుకు మరో 15, 20 రోజుల సమయం పడుతుంది. కాబట్టి అంత ప్రమాదమేమీ లేదు.
ఇతర రాష్ట్రాల్లో ఎలాంటి నివారణ చర్యలు చేపడుతున్నారు?
ఒక్కో దగ్గర ఒక్కో విధానాన్ని అమలు చేస్తున్నారు. కొన్ని గ్రామాల్లో ట్రాక్టర్ల ద్వారా కేంద్ర ప్రభుత్వం సిఫారసు చేసిన మోనోక్రోటోఫాస్ లాంటి రసాయనాలను భారీగా పిచికారీ చేస్తున్నారు. దాంతో చాలా వరకు చనిపోతాయి, కొన్ని ఎగిరిపోతాయి. వందశాతం చనిపోవు, పరిమాణం తగ్గుతుంది.
రాష్ట్ర ప్రభుత్వం ఏం చేయబోతోంది?
ముందస్తుగా సన్నద్ధమయ్యాం. వస్తే ఏం చేయాలన్న విషయమై వ్యవసాయ, ఉద్యానవన, పోలీసు, రెవెన్యూ, అగ్నిమాపక, విపత్తు నిర్వహణ శాఖలతో పాటు విశ్వవిద్యాలయ నిపుణులు, శాస్త్రవేత్తలతో సీఎం సమీక్ష జరిపారు. నిపుణుల కమిటీ రామగుండం వెళ్లింది. జిల్లా యంత్రాంగాలను అప్రమత్తం చేయడంతో పాటు పూర్తి అవగాహన కలిగిస్తున్నాం. అవసరమైన రసాయనాలు, అగ్నిమాపక యంత్రాలు ఆయా జిల్లాల్లో సిద్ధం చేసుకున్నాం. మన రాష్ట్రంలోకి మిడతల దండు వస్తే నియంత్రించే అవకాశం ఉంది.
ఉద్యానవన పంటల రైతులు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
మిడతల దండు పరిమాణాన్ని బట్టి నియంత్రణ చర్యలు ఉంటాయి. చిన్నదండు వస్తే శబ్దాలు చేస్తే, చెత్తను కాలిస్తే పోతాయంటున్నారు. పెద్దదండు వస్తే రైతుల కంటే ప్రభుత్వపరంగా చేస్తేనే ప్రయోజనం ఉంటుంది. పరిస్థితిని ఎప్పటికప్పుడు నిర్ణయించకుంటాం. గాలి మళ్లితే రాష్ట్రానికి రావచ్చు. రాజస్థాన్‌లో ఉన్నంత ఉద్ధృతి లేదు. అంతగా బెంబేలెత్తాల్సిన, భయపడాల్సిన అవసరం లేదు. ఉద్యానవన పంటలకు కూడా ఏమీ కాదనే అనుకుంటున్నాం.
- ఇదీ చూడండి:చైనాతో సరిహద్దుల వద్ద దూకుడుగానే సైన్యం!