గూడూరు నారాయణ రెడ్డి... టీపీసీసీ కోశాధికారిగా ఉన్నారు. ఆయన ఇటీవల కరోనా భారీన పడి కోలుకున్నారు. కరోనా పాజిటివ్ వచ్చిన వాళ్లు ఎలా తీవ్ర ఆందోళనకు గురవుతారు... వారు పడే ఇబ్బందులు ఎలా ఉంటాయి తదితరాలను స్వయంగా అనుభవించారు.
కరోనా చికిత్సలో కీలకంగా భావించే ప్లాస్మాదానం చేయించి... బాధితులకు అండగా నిలువాలని నిర్ణయించుకున్నారు. ఆ తరువాత మరికొంత మంది కరోనా నుంచి కోలుకున్న వారిని కలుపుకుని జులై 16న... తెలంగాణ ప్లాస్మా దాతల అసోసియేషన్ పేరుతో ఓ స్వచ్ఛంద సంస్థను ఏర్పాటు చేశారు.
ఆ మరుసటి రోజు నుంచే అసోసియేషన్ సభ్యులతో కలిసి కరోనా బాధితులకు సేవలు అందించే పనిని ప్రారంభించారు. కరోనా నుంచి కోలుకుని బయట పడ్డ వారి జాబితాను ప్రభుత్వం నుంచి తెప్పించుకుని... అర్హులను గుర్తించి ఫోన్ ద్వారా సంప్రదిస్తూ ప్లాస్మాదానం చేయించేందుకు ప్రయత్నం మొదలు పెట్టారు.
ప్లాస్మాదాతల కోసం ఎక్కువ మందికి ఫోన్ ద్వారా సంప్రదించాల్సి రావడం వల్ల... తన కుమారుడు ప్రణయ్‌రెడ్డితోపాటు మరికొందరిని తనకు సహాయకులుగా ఏర్పర్చుకున్నారు. తెలంగాణ ప్లాస్మా డోనార్స్.కామ్ అని ఒక వెబ్‌సైట్‌ను ఏర్పాటు చేసుకున్నారు. ప్లాస్మా కావాలని ఫోన్ చేస్తున్న ప్రతి ఒక్కరిని ఆ వెబ్‌సైట్‌లో వివరాలు నమోదు చేసుకోవాలని చెప్తున్నారు. చేసుకునే లోపు... డోనర్స్‌ను ఏర్పాటు చేస్తున్నారు. ఇప్పటి వరకు ఆ వెబ్‌సైట్‌లో రెండువేలకుపైగా వివరాలను నమోదు చేసుకోగా... ఏడున్నర వేల మంది ఆ వెబ్‌సైట్‌ను సందర్శించారు. నాలుగు వందల మంది ప్లాస్మాదాతల ద్వారా దాదాపు అయిదు వందల మందికి థెరపీ చేయించినట్లు ఆయన తెలిపారు.
కరోనా నుంచి సురక్షితంగా బయటపడ్డ తాను పది మంది బాధితులకు ఉపయోగపడే పని చేయాలని ఆలోచించి... ఎలాంటి ప్రయోజనాన్ని ఆశించకుండా సేవలు అందిస్తున్నారు. తెలంగాణ ప్లాస్మా దాతల సంఘం సాయంతో ప్రాణాపాయం నుంచి బయట పడ్డ వారి కుటుంబ సభ్యులు, బంధువులు... గూడూరు నారాయణ రెడ్డికి కృతజ్ఞతలు తెలియచేస్తున్నారు. ప్లాస్మాదానం చేసేందుకు కరోనా నుంచి కోలుకున్న ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని విజ్ఞప్తి చేస్తున్నారు. ప్లాస్మాదానం చేసేందుకు ముందుకొచ్చిన వారిలో ఎవరికైనా రవాణాలో ఇబ్బందులు ఉంటే.. ఆయనే వాహనం ఏర్పాటు చేస్తున్నారు. డిమాండ్ ఎక్కువ ఉన్నందున... సేవాభావంతో దాతలు ముందుకు రావాలని విజ్ఞప్తి చేస్తున్నారు.