కర్నాటక ప్రభుత్వం తుంగభద్ర నదిపై చేపట్టిన అప్పర్ తుంగ, అప్పర్ భద్ర ప్రాజెక్టులకు అనుమతులు నిలిపివేయాలని కేంద్ర జలసంఘాన్ని రాష్ట్ర ప్రభుత్వం కోరింది. ఈ మేరకు కేంద్ర జలసంఘం ప్రాజెక్టు అప్రైజల్ డైరెక్టరేట్కు రాష్ట్ర ఈఎన్సీ మురళీధర్ లేఖ రాశారు. అప్పర్ తుంగ, అప్పర్ భద్ర ప్రాజెక్టులకు అనుమతులపై అభ్యంతరం తెలిపిన రాష్ట్ర సర్కార్.. అంతర్ రాష్ట్ర అంశాలు, ట్రైబ్యునల్ తీర్పులను పరిగణనలోకి తీసుకోకుండా అనుమతులు ఇవ్వరాదని పేర్కొంది. ఈ రెండు ప్రాజెక్టులకు నీటి కేటాయింపులు చేసే విషయమై బచావత్ ట్రైబ్యునల్ విభేదించిందని లేఖలో తెలిపింది.
బ్రిజేష్ కుమార్ ట్రైబ్యునల్ కేటాయింపులు చేసినప్పటికీ సుప్రీంకోర్టులో పిటిషన్లు పెండింగ్లో ఉన్నాయని పేర్కొంది. కృష్ణా బేసిన్లో నీటిలభ్యత తక్కువగా ఉందని, రెండు ప్రాజెక్టులకు అనుమతులతో కృష్ణాకు తుంగభద్ర నుంచి ప్రవాహాలు భారీగా తగ్గుతాయని ఆందోళన వ్యక్తం చేసింది. కృష్ణాకు ప్రవాహాలు తగ్గితే రాష్ట్ర ప్రయోజనాలపై తీవ్రంగా ప్రభావం చూపుతుందని తెలిపింది. అప్పర్ తుంగ, అప్పర్ భద్ర ప్రాజెక్టులకు అనుమతులు ఇచ్చే సమయంలో దిగువ రాష్ట్రాల అవసరాలను పరిగణనలోకి తీసుకోవాల్సిన అవసరం ఉందని పేర్కొంది. వీటన్నింటి నేపథ్యంలో రెండు ప్రాజెక్టులకు ప్రాజెక్టు అప్రైజల్ కమిటీ ఇచ్చిన అనుమతులను వెంటనే నిలిపివేయాలని కేంద్ర జలసంఘానికి విజ్ఞప్తి చేసింది. బ్రిజేష్ కుమార్ ట్రైబ్యునల్ తీర్పు అమల్లోకి వచ్చే వరకు వాటిని నిలుపుదల చేయాలని కోరింది.
ఇవీ చూడండి: