మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్ పట్టణానికి చెందిన 16 ఏళ్ల యువకుడు అజ్జు 11వ తరగతి చదువుతున్నాడు. గొప్ప డ్యాన్సర్ కావాలని కలలు కన్నాడు. కానీ అజ్జు తల్లితండ్రులకు అతడు డ్యాన్సర్ అవడం ఇష్టం లేదు. చదువు మీద శ్రద్ధ పెట్టమని తరచూ మందలించేవారు. తనకు కుటుంబసభ్యులు సహకరించడం లేదని స్నేహితులతో చెప్పేవాడు. తీవ్ర మనస్తాపానికి గురైన అజ్జు రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. ఝాన్సీ రోడ్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. అక్కడే పోలీసులకు అజ్జు రాసిన సూసైడ్ నోట్ లభ్యమైంది.
సూసైడ్ నోట్‌లో... "‘అమ్మా, నాన్నా.. నన్ను క్షమించండి. నేను మీకు మంచి కొడుకును కాలేకపోయాను. మిమ్మల్ని విడిచి వెళ్తున్నందుకు బాధగా ఉంది. నేనొక గొప్ప డ్యాన్సర్‌ని కావాలని చిన్నప్పటి నుంచి కలలు కన్నాను. కానీ దానికి మీరు సపోర్ట్ చేయలేదు. నేను చేసే పనులేవి మీకు నచ్చవు. నా హెయిర్ స్టయిల్, నా స్నేహితులు.. నాకు సంబంధించినవి ఏవీ మీకు నచ్చవు. అందుకే నేను చనిపోతున్నా. నా చావుకు ఎవరూ బాధ్యులు కాదు." అని లేఖలో రాశాడు.
అదే లేఖలో.. "‘ప్రభుత్వానికి నాదొక విన్నపం. నా చావు తర్వాత నాపై ఒక పాట రాయించాలి. దేశంలోనే అతి పెద్ద సింగర్ అయిన అర్జిత్ సింగ్‌తో ఆ పాటను పాడించాలి. నేపాల్‌కు చెందిన ప్రముఖ డ్యాన్సర్ సుశాంత్ కత్రి ఆ పాటకు డ్యాన్స్ చేయాలి. ఆయనే దానికి కొరియోగ్రాఫీ చేయాలి. నా చివరి కోరిక నెరవేర్చితేనే నా ఆత్మ శాంతిస్తుంది. నా ఈ చిన్న కోరికను తీర్చమని ప్రధానిని కూడా కోరుకుంటున్నాను" అని పేర్కొన్నాడు.
ఝాన్సీ రోడ్ పోలీస్ స్టేషన్ ఇంచార్జ్ సంజీవ్ నయన్ శర్మ కేసు వివరాలు వెల్లడించారు. రైలు కిందపడి ఆత్మ హత్య చేసుకోవడంతో కుర్రాడి శరీరం రెండు భాగాలుగా విడిపోయిందన్నారు. ఘటనా స్థలంలో తమకు సూసైడ్ నోట్ లభ్యమైందని, దాన్ని స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. ఈ ఘటనకు సంబంధించి కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నామన్నారు. బాధితుడు ఒత్తిడికి గురై ఆత్మహత్య చేసుకున్నట్లు తాము భావిస్తున్నామన్నారు. శవ పరీక్ష అనంతరం మృతదేహాన్ని కుటుంబసభ్యులకు అప్పగించినట్లు తెలిపారు.
ఇదీ చదవండి : చైతూ తలచుకుంటే ఆ సమస్యకు చెక్: సామ్ ఫ్యాషన్ డిజైనర్