ఎంపీ రఘురామ కృష్ణరాజు బెయిల్ పిటిషన్ ప్రక్రియలో న్యాయపరమైన సమస్యలు ఇంకా కొనసాగుతున్నాయి. సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం రఘురామ బెయిల్‌పై విడుదలైనప్పటికి... ప్రక్రియ ఇంకా పెండింగ్‌లోనే ఉంది. ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయ్యాక... 10 రోజుల్లోగా పూచీకత్తులు సమర్పించాలని సుప్రీం ఆదేశాలతో.. గత నెల 28న రఘురామ తరపున ఇద్దరు పూచీకత్తు సమర్పించారు. రఘురామ నుంచి బెయిల్ బాండ్ షూరిటీలపై జైలు అధికారులు సంతకాలు తీసుకోలేదు. అతని సంతకాలు లేకుండానే సీఐడీ కోర్టుకు బెయిల్ బాండ్‌ను జైలు అధికారులు సమర్పించారు. వాటిపై రఘురామ సంతకాలు లేకుంటే రిమాండ్ వారెంట్ జిల్లా జైలు వద్ద ఇంకా పెండింగ్‌లో ఉంటుందని భావిస్తున్నట్లు సీఐడీ కోర్టు పేర్కొంది.
ముద్దాయి జ్యూడీషియల్ కస్టడీ నుంచి రిలీజ్ కాలేదని భావించాల్సి వస్తుందని సీఐడీ కోర్టు తెలిపింది. ఈ నెల 25 వరకు రఘురామ జ్యూడీషియల్ రిమాండ్‌ను పొడిగిస్తూ ఈనెల 11న సీఐడీ న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది. మరి ఇప్పుడు రఘురామ సంతకాలు తీసుకోవడానికి జైలు అధికారులు వెళ్తారా? లేక అతడిని పోలీసుల సాయంతో జిల్లా జైలు వద్దకు తీసుకువస్తారా? అనేది వెల్లడి కావాల్సి ఉంది. ఆస్పత్రి నుంచి బయటకు వచ్చినప్పటికీ బెయిల్ పిటిషన్ ప్రక్రియ పూర్తి కాకపోవడంతో... రఘురామకు సీఐడీ న్యాయస్థానం రిమాండ్‌ను పొడిగించింది.