ఆంధ్రప్రదేశ్‌లోని కడప జిల్లా ప్రొద్దుటూరులో.. తెదేపా జిల్లా అధికార ప్రతినిధి నందం సుబ్బయ్య హత్యపై.. పార్టీ శ్రేణులు తీవ్రంగా స్పందించాయి. సెంటు పట్టా స్థలాల పంపిణీలో వైకాపా నేతల అవినీతిని ప్రశ్నించిన సుబ్బయ్యను అత్యంత దారుణంగా హతమార్చటం ప్రభుత్వ అరాచక పాలనకు అద్దం పడుతోందని నందిగామ తెదేపా నేతలు అన్నారు. పోలీస్ ఉన్నతాధికారిని బదిలీ చేసి 24 గంటల్లో సుబ్బయ్యను హత మార్చారని ఆరోపించారు. నందిగామ పట్టణ పట్టణ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో నిరసనగా ప్రదర్శన నిర్వహించారు. మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య తెదేపా శ్రేణులు పాల్గొన్నాయి.
హత్యా రాజకీయాలు వైకాపా ప్రభుత్వానికి తగదని గుంటూరు జిల్లా నరసరావుపేట నియోజకవర్గ తెదేపా ఇంచార్జి డాక్టర్ చదలవాడ అరవింద బాబు అన్నారు. సుబ్బయ్య హత్యకు.. ప్రభుత్వం, వైకాపా నాయకులు బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు.
విమర్శలకు మంత్రుల కౌంటర్
రాష్ట్రంలో ఏ మూల ఏది జరిగిన అధికార పార్టీకి అంటగట్టడం దారుణమని ఉపముఖ్యమంత్రి అంజాద్ బాష అన్నారు. ప్రొద్దుటూరులో తెదేపా నేత దారుణ హత్యకు వైకాపాకు సంబంధం ఉందని ఆరోపించడం సరైంది కాదన్నారు. సుబ్బయ్య పై గతంలో 14 కేసులు ఉన్నాయని.. అందులో నాలుగు క్రిమినల్ కేసులు అని చెప్పారు. సుబ్బయ్యను ఎవరు హత్య చేశారో అందరికీ తెలిసిందేనని పేర్కొన్నారు. ప్రొద్దుటూరు శాసనసభ్యులపై నిందలు వేయడం మంచి పద్ధతి కాదన్నారు.
సుబ్బయ్య హత్య సంఘటనపై ప్రభుత్వ చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి స్పందించారు. ఘటననపై సంతాపం ప్రకటించారు. తమ ప్రభుత్వం ఉన్నప్పుడు.. నేరం ఎవరు చేసినా శిక్షార్హులేనన్నారు. సుబ్బయ్యపై 14 నేరాలకు సంబంధించిన కేసులతో పాటు ఒకటి రేప్ కేసు ఉందని చెప్పారు. ఈ విషయంపై చంద్రబాబు, లోకేష్ లు విచారణ జూమ్ సమావేశాలు, ట్విట్టర్ పోస్టులు పెట్టాలని డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి స్వంత జిల్లా కావడంతో తెదేపా నేతలు.. మైలేజి కోసం మాత్రమే ప్రభుత్వంపై బురద చల్లుతున్నారని ఆరోపించారు.
నేడు అంత్యక్రియలు..
బుధవారం జరగాల్సిన నందం సబ్బయ్య అంత్యక్రియలు.. ఇవాళ్టికి వాయిదా పడ్డాయి. బుధవారం అంత్యక్రియలకు ఏర్పాట్లు చేయగా.. కార్యక్రమానికి పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ హాజరయ్యారు. అయితే.. తాను చెప్పిన వారి పేర్లను ఎఫ్ఐఆర్లో పోలీసులు నమోదు చేయలేదని.. సుబ్బయ్య భార్య అపరాజిత.. విషయాన్ని లోకేశ్ దృష్టికి తీసుకొచ్చారు. హత్య కేసులో ఎమ్మెల్యే శివప్రసాద్ రెడ్డి, ఆయన బావ బంగారు మునిరెడ్డి, మున్సిపల్ కమిషనర్ రాధ పేర్లను నమోదు చేయలేదని చెప్పారు. అపరాజిత చెప్పిన పేర్లను ఎఫ్ఐఆర్లో చేర్చేవరకు అంత్యక్రియలు నిర్వహించేది లేదంటూ లోకేశ్, తెదేపా నేతలు ఆందోళనకు దిగారు. సుబ్బయ్య ఇంటి వద్దే బైఠాయించారు. సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు ధర్నా కొనసాగింది. చివరికి పోలీసులు దిగివచ్చారు. బాధితులు డిమాండ్ చేసిన పేర్లను... 15 రోజుల్లో నమోదు చేస్తామని చెప్పారు. ఈ నేపథ్యంలో ఇవాళ సుబ్బయ్య అంత్యక్రియలు జరగనున్నాయి.
సుబ్బయ్య కుటుంబానికి నేతల ఆర్థిక సాయం
హత్యకు గురైన తెదేపా నేత నందం సుబ్బయ్య కుటుంబానికి తెదేపా నాయకులు ఆర్థిక సాయం ప్రకటించారు. పుట్టా సుధాకర్‌యాదవ్ రూ.5 లక్షలు అందజేస్తానని హామీ ఇచ్చారు. ఎమ్మెల్సీ బీటెక్ రవి జిల్లాలో అందుబాటులో లేకపోయినా ఆయన అనుచరుల ద్వారా సుబ్బయ్య కుటుంబ సభ్యులకు రూ.లక్ష చెక్కు అందజేశారు.
ఇదీ చదవండి: సాగు చట్టాలకు వ్యతిరేకంగా కేరళ అసెంబ్లీలో తీర్మానం