తెదేపా అధినేత, ఏపీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుపై వైకాపా నేతల వ్యాఖ్యలపై నందమూరి కుటుంబసభ్యులు స్పందించారు. తన సోదరి భువనేశ్వరిపై వ్యక్తిగత విమర్శలు చేయడం బాధాకరమన్న బాలకృష్ణ.. అసెంబ్లీలో ఉన్నామో, పశువుల కొంపలో ఉన్నామో అర్థం కావడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎంతో ధైర్యంగా ఉండే చంద్రబాబు కంటతడి పెట్టుకోవటం తాము ఎప్పుడూ చూడలేదని నందమూరి బాలకృష్ణ అన్నారు. ప్రజాసమస్యలపై పోరాడాల్సిన అసెంబ్లీలో అభివృద్ధిపై బదులు.. వ్యక్తిగత అజెండా తీసుకువచ్చారని మండిపడ్డారు. వైకాపా నుంచి మహిళా శాసనసభ్యులు సభలో ఉన్నారన్న బాలకృష్ణ.. అందరి కుటుంబాల్లో ఆడవాళ్లు ఉన్నారని.. హేళన చేయొద్దని హితవు పలికారు. ఈ పరిణామాలతో కొత్త నీచ సంస్కృతికి తెరలేపారని ఆక్షేపించారు. రాష్ట్రం ఏ పరిస్థితుల్లో ఉందో ప్రజలు గమనిస్తున్నారని పేర్కొన్నారు.
ఇక ఉపేక్షించేది లేదు..
"ఆడవాళ్ల జోలికొస్తే చేతులు ముడుచుకోవడం సరికాదు. మంచి సలహాలు ఇచ్చినా తీసుకునే పరిస్థితిలో ఈ ప్రభుత్వం లేదు. మీరు మారకపోతే మెడలు వంచి మారుస్తాం. మంగళగిరిలో పార్టీ కార్యాలయంపై దాడి చేయించారు. చంద్రబాబుపై ఎన్నోవిధాలుగా దాడులకు ప్రయత్నించినా ఆయన సంయమనంతో ఉన్నారు. ఇకపై ఎవరు నోరు తెరిచినా ఉపేక్షించేది లేదు. ఆడవాళ్లను తెరపైకి తెచ్చి రాజకీయాల్లో మైండ్‌గేమ్ ఆడుతున్నారు. రాజకీయాల్లో అధికారం ఎప్పుడూ శాశ్వతం కాదు. వ్యవస్థలన్నింటిని నిర్వీర్యం చేశారు.. మీకు దాసోహం చేసేలా చేసుకోవడం మంచిది కాదు."
- నందమూరి బాలకృష్ణ, హిందూపురం ఎమ్మెల్యే
సీఎం కొడుకుగా కానీ.. సీఎంకు బావమరిదిగానూ తాను ఏనాడు మాట్లాడలేదని బాలకృష్ణ అన్నారు. అసెంబ్లీలో ఆరోగ్యకరమైన వాతావరణం ఉండాలని సూచించారు. తమను అడ్డుకునే ఎలాంటి కుట్రలనైనా తిప్పికొడతామన్న బాలకృష్ణ.. వైకాపా నేతల వేషం, భాష, ఆహార్యం చూస్తే గొడ్లచావిడికి వచ్చినట్లుందని మండిపడ్డారు. రాజకీయాలతో సంబంధం లేని వారిపై మాటల దాడి సరికాదని హితవు పలికారు. ఇదే తీరు కొనసాగితే ఆవేశానికి అడ్డుకట్ట ఉండదని, ఏం అడ్డుపెట్టుకున్నా బద్ధలు కొట్టుకొస్తామని బాలకృష్ణ హెచ్చరించారు.
భరతం పడతాం..
"చంద్రబాబు పాలనలో అన్ని వర్గాలకు సౌకర్యాలు కల్పించారు. ముందుచూపు ఉన్న దార్శనికుడు చంద్రబాబు. విర్రవీగి మాట్లాడేవారు ఇక నోరు అదుపులో పెట్టుకోవాలి. చంద్రబాబు వల్లే ఇప్పటివరకు సహనం పాటించాం. మీరు ప్రజాప్రతినిధులు కాబట్టే గౌరవంగా చూశాం. మళ్లీ ఇలాంటి నీచమైన పదాలు వాడితే భరతం పడతాం."
- నందమూరి బాలకృష్ణ, హిందూపురం ఎమ్మెల్యే
సంబంధిత కథనాలు :