ఏపీలో వైకాపా అరాచక పాలనకు అంతం ఆరంభమైందని, నాలుగో విడత పంచాయతీ ఎన్నికల్లో సీఎం జగన్ పాలనకు చరమగీతం పాడటానికి ప్రజలు నాంది పలికారని తెదేపా నేతలు పేర్కొన్నారు. ఆదివారం 2,743 పంచాయతీలకు నిర్వహించిన పోలింగ్‌లో.. రాత్రి 11 గంటల వరకు అందిన ఫలితాల ప్రకారం 848 పంచాయతీల్లో తమ పార్టీ మద్దతుదారులు గెలిచారన్నారు. వైకాపా మద్దతుదారులు 1,202 చోట్ల విజయం సాధించారని తెదేపా నేతలు ప్రకటించారు. నాలుగో విడత పంచాయతీ ఎన్నికల్లో తెదేపా మద్దతుదారుల విజయాన్ని పురస్కరించుకుని పార్టీ శ్రేణులు మంగళగిరిలోని పార్టీ జాతీయ కార్యాలయం దగ్గర ఆదివారం రాత్రి బాణసంచా కాల్చి సంబరాన్ని నిర్వహించాయి.
తగిన బుద్ధి చెబుతారు:
‘వైకాపా నాయకులు రాత్రిళ్లు ఎన్నికల ఫలితాలను తారుమారు చేస్తారు. చీకటి పడిన తర్వాత ఫలితాల సరళిలో ఎందుకు తేడా వస్తోంది? డీజీపీ ఇక్కడే ఉండి పోలీసు శాఖను అప్రమత్తం చేయకుండా ప్రశాంతంగా ఉన్న విజయనగరంలో తిరుగుతున్నారు. సీఎంగా జగన్ ఇంకా మూడేళ్లు కొనసాగాలంటే ప్రజాస్వామ్యంగా పరిపాలన ఉండాలి. దుర్మార్గంగా, దౌర్జన్యంగా ఉంటే ప్రజలు తగిన బుద్ధి చెబుతారు’ అని పార్టీ సీనియర్ నేత వర్ల రామయ్య అన్నారు. పంచాయతీ ఎన్నికల్లో ప్రతి దశలో తెదేపా బలపరచిన వారి విజయాల శాతం పెరుగుతూ వచ్చిందని అధికార ప్రతినిధి పట్టాభిరామ్ పేర్కొన్నారు. ‘ఎన్నికలకు ముందు 90% పంచాయతీల్లో అసలు పోటీ లేకుండా గెలుస్తామని వైకాపా నేతలు గొప్పగా చెప్పుకున్నారు. మొదటిదశలో 38.7% స్థానాల్లో గెలిచాం. రెండో దశలో 39.5%, మూడో దశలో 41.4% స్థానాల్లో గెలిచాం. నాలుగో దశలో 50% గ్రామ పంచాయతీలు మావే అవుతాయి. వైకాపాకు ప్రజలు ఫలితాలతో బుద్ధి చెప్పారు’ అని విమర్శించారు.
ఒక్క ఓటుతో విజయం సాధిస్తే..
రాత్రి 7 గంటల వరకూ తెదేపా, వైకాపా సమంగా ఫలితాలు సాధించినా.. అక్కడి నుంచి వైకాపా ఫలితాలను తారుమారు చేస్తోందని ఎమ్మెల్సీ అశోక్‌బాబు పేర్కొన్నారు. ‘ఒక్క ఓటుతో తెదేపా బలపరచిన అభ్యర్థి విజయం సాధిస్తే.. వైకాపా మద్దతుదారుడు రెండు ఓట్ల మెజారిటీతో గెలిచినట్లు ప్రకటించారు. ప్రతిచోటా తెదేపా మద్దతుదారులకు 40 శాతం ఓట్లు వచ్చాయంటే ప్రజలు ఎంతగా వైకాపాను అసహ్యించుకుంటున్నారో అర్థం అవుతోంది’ అని అన్నారు. ప్రజలు మార్పు కోరుకుంటున్నారనటానికి పంచాయతీ ఫలితాలే నిదర్శనమని తెదేపా రైతు విభాగం నాయకుడు మర్రెడ్డి శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు.
తెదేపా విడుదల చేసిన జాబితా..
జిల్లా | తెదేపా | వైకాపా | జనసేన/భాజపా | ఇతరులు |
శ్రీకాకుళం | 79 | 116 | 0 | 1 |
విజయనగరం | 67 | 96 | 0 | 3 |
విశాఖపట్నం | 24 | 33 | 0 | 0 |
తూర్పు గోదావరి | 48 | 50 | 5 | 9 |
పశ్చిమగోదావరి | 63 | 49 | 2 | 11 |
కృష్ణా | 59 | 39 | 0 | 4 |
గుంటూరు | 67 | 46 | 3 | 0 |
ప్రకాశం | 34 | 82 | 1 | 2 |
నెల్లూరు | 31 | 63 | 0 | 6 |
కడప | 1 | 63 | 12 | 17 |
కర్నూలు | 70 | 113 | 0 | 2 |
అనంతపురం | 41 | 83 | 0 | 13 |
చిత్తూరు | 50 | 114 | 0 | 1 |
మొత్తం | 634 | 947 | 23 | 69 |
ఇదీ చదవండి: కృత్రిమ మేధతో సీసీ కెమెరాల వినియోగం... కేసుల దర్యాప్తులో ఇవే కీలకం