కొండపల్లి అటవీ ప్రాంతంలో అక్రమ మైనింగ్‌కు బీజం వేసింది వైఎస్ రాజశేఖర్‌రెడ్డేనని తెదేపా జాతీయ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్ ఆరోపించారు. తండ్రి బీజం వేస్తే కుమారుడు అధికారంలోకి వచ్చాక దాన్ని పెంచి పెద్దది చేశారని పరోక్షంగా ఏపీ సీఎం జగన్‌ను ఉద్దేశించి ఆయన వ్యాఖ్యానించారు.
‘‘వైఎస్‌ఆర్ హయాంలో రెవెన్యూ రికార్డులను టాంపర్ చేసి లేని సర్వే నంబర్ 143ను సృష్టించారు. ఆ సర్వే నంబర్ కింద అక్రమ మైనింగ్ కోసం 216.25 ఎకరాలు కేటాయించారు. సర్వే నంబర్ 143 ఇంకు పెన్నుతో రాసి సృష్టించిందేనని డిసెంబర్ 27, 2016న ఇచ్చిన తీర్పులో హైకోర్టు చాలా స్పష్టంగా చెప్పింది. తెదేపా ప్రభుత్వంలో హైకోర్టు తీర్పునకు లోబడి 2017లో అప్పటి సీఎం చంద్రబాబు మైనింగ్ లీజులన్నీ రద్దు చేశారు. అప్పటి రెవెన్యూ మంత్రిగా కేఈ కృష్ణమూర్తి ఉన్న సమయంలో సదరు సర్వే నంబర్లలోని భూములను రెవెన్యూ భూములుగా పరిగణించినట్లు వైకాపా ఆరోపిస్తోంది. కానీ దస్త్రాలు పరిశీలించి నిర్ణయం తీసుకుందామనే నాడు కేఈ కృష్ణమూర్తి చెప్పారు. అటవీ భూములను రెవెన్యూ భూములుగా మార్చింది జగన్‌మోహన్‌రెడ్డి హయాంలోనే. జగన్, ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ డైరెక్షన్‌లోనే అక్టోబర్ 17, 2019న అధికారులు అటవీ భూములను రెవెన్యూ భూములుగా మార్చారు’’- తెదేపా జాతీయ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్.
నకిలీ సర్వే నంబర్లతో దోపిడీ చేశారు..
కొండపల్లిలో నిజాలను వెలికి తీయడానికి వెళ్లిన దేవినేని ఉమను ప్రభుత్వం అక్రమంగా అరెస్టు చేయడాన్ని మాజీ మంత్రి పత్తిపాటి పుల్లారావు తీవ్రంగా ఖండించారు. అవినీతిని ప్రశ్నిస్తే ప్రభుత్వం అక్రమ కేసులు పెడుతూ దుర్మార్గంగా వ్యవహరిస్తుందని విమర్శించారు. కొండపల్లిలో ఏ అక్రమాలు, అన్యాయాలు జరగలేదంటున్న ప్రభుత్వం.. ఉమ పరిశీలనకు వెళితే అభ్యంతరం ఏమిటని ప్రశ్నించారు. రాష్ట్రంలో సీఎం జగన్ మోహన్ రెడ్డి నాయకత్వంలో అధికార పార్టీ ఎమ్మెల్యేలు, నాయకులు అరాచకాలకు పాల్పడుతున్నారని, ఒక్కొక్క ఎమ్మెల్యే స్థానికంగా ఉన్న వనరులు దోచుకుంటూ రూ. 200 కోట్ల నుంచి రూ. 1000 కోట్ల వరకు కొల్లగొడుతున్నారని విమర్శించారు. ఇందుకు నిదర్శనంగా చిలకలూరిపేటలో ప్రతిరోజు 500 లారీల మట్టి ఇసుక తరలి పోతుందన్నారు.
ప్రతి నెల 10 లారీల అక్రమ మద్యం వస్తుంది. పెద్ద ఎత్తున అక్రమంగా రేషన్ బియ్యం తరలిస్తున్నారు. అవినీతిని ప్రశ్నించే వారి మీద అక్రమ కేసులు పెడుతూ ప్రభుత్వం దారుణంగా వ్యవహరిస్తోంది. రోడ్లు అభివృద్ధికి మూడు సార్లు టెండర్లు పిలిచినా కాంట్రాక్టర్లు ముందుకు రావడం లేదు. ఇందుకు కారణం గత ప్రభుత్వంలో చేసిన పనులకు బిల్లులు చెల్లించకపోవటమే. ఇప్పటికైనా సీఎం ఆత్మపరిశీలన చేసుకోవాలి. రాజమండ్రి జైలర్ మార్చటంలో ఆంతర్యమేమిటో ప్రజలకు తెలియాలి. -మాజీ మంత్రి పత్తిపాటి పుల్లారావు