Gudivada Casino Issue: ఏపీ గుడివాడ క్యాసినో వ్యవహారంపై ఫిర్యాదు చేసేందుకు డీజీపీ కార్యాలయానికి రాకుండా తెలుగుదేశం పార్టీ నిజనిర్ధారణ కమిటీని పోలీసులు రోడ్డు మీదే అడ్డుకున్నారు. డీజీపీ కార్యాలయానికి వెళ్లేందుకు అనుమతి లేదంటూ రోడ్డుపై ముళ్ల కంచెలు, బారికేడ్లు అడ్డుపెట్టారు. దీంతో పోలీసులకు తెలుగుదేశం నేతలకు తీవ్ర వాగ్వాదం జరిగింది. డీజీపీ లేకుంటే ఉన్న అధికారులకు ఫిర్యాదు చేస్తామని నేతలు చెప్పడంతో రోడ్డుపై తమకే ఫిర్యాదు ఇచ్చి వెళ్లమని పోలీసులు చెప్పారు. దీంతో రోడ్డు పైనే అదనపు ఎస్పీ గంగాధరమ్ కు తెదేపా నేతలు ఫిర్యాదు లేఖ ఇచ్చారు. ఫిర్యాదు స్వీకరించినట్లు అదనపు ఎస్పీ ఆకన్నాలేజ్మెంట్ రాసి ఇచ్చారు.
TDP Fact Finding Committee complaint to dgp: చట్టాన్ని నడివీధిలోకి లాగి, న్యాయం బట్టలూడ తీసినట్లు పోలీసుల వ్యవహారం ఉందని తెలుగుదేశం నేతలు ధ్వజమెత్తారు. చట్టాన్ని రక్షించాల్సిన పోలీసులే దానిని ఉల్లంఘిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. క్యాసినో వ్యవహారంపై పోలీసులు నిస్తేజంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. పోలీసులు జగన్ రెడ్డి యాక్ట్ అనుసరిస్తుండటం దుర్మార్గమని మండిపడ్డారు. చేసిన తప్పులకు ప్రభుత్వం, డీజీపీ భయపడుతున్నారన్నారు. ఫిర్యాదు చేసేందుకు సమయం ఇవ్వకపోగా డీజీపీ కార్యాలయానికే రాకుండా రోడ్డుపైనే మమ్మల్ని అడ్డుకున్నారని విమర్శించారు. రోడ్డుపై ఫిర్యాదు తీసుకున్నందుకు పోలీసు వ్యవస్థ సిగ్గుతో తలదించుకోవాలన్నారు. బడుగు, బలహీన వర్గాలకు డీజీపీ కార్యాలయంలోకి అనుమతి లేదన్నట్లు పోలీసులు వ్యవహరించారని దుయ్యబట్టారు. న్యాయం కోసం ఎంతవరకైనా పోరాడతామని తేల్చిచెప్పారు.
ఇదీ చదవండి: Cyber Criminals Robbed: సైబర్ నేరగాళ్ల మాయ.. మహేశ్ బ్యాంకులో రూ. 12 కోట్ల లూటీ
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!