కరోనా కష్ట సమయంలో ఏపీలో ఒక్కరోజు అసెంబ్లీ సమావేశాలు పెట్టడం మంచి పద్ధతి కాదని తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు అన్నారు. గురువారం జరగబోయే బడ్జెట్ సమావేశాలను తెదేపా బహిష్కరిస్తోందని వెల్లడించారు. కరోనా కట్టడి కోసం సీఎం జగన్ ఆలోచించడం లేదన్న ఆయన .. ప్రజల ప్రాణాలు కాపాడేందుకు ప్రయత్నించాలని హితవు పలికారు.
కరోనా విపత్కర పరిస్థితుల్లో సీఎం జగన్ ఒక్కసారైనా అఖిలపక్ష సమావేశం పెట్టారా ? అని అచ్చెన్నాయుడు నిలదీశారు. ప్రతిపక్ష నేతల సూచనలు, సలహాలు తీసుకోవాలన్న ఆయన..పక్క రాష్ట్రాలను చూసి కూడా ముఖ్యమంత్రి నేర్చుకోవటం లేదని మండిపడ్డారు.
ఏపీ సీఎం జగన్ నిర్లక్ష్యానికి 106 మంది బలి
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ నిర్లక్ష్యం వల్ల ఆక్సిజన్ అందక 106 మంది చనిపోయారని అచ్చెన్నాయుడు ఆవేదన వ్యక్తం చేశారు. వైకాపా ప్రభుత్వం రోగులకు పడకలు, మందులు, ఆహారం అందటం లేదని విమర్శించారు. తమ ప్రాణాలు కాపాడాలని కరోనా రోగులు సర్కారును వేడుకుంటున్నారని అన్నారు. తమిళనాడు, కేరళ తరహాలో కొవిడ్ రోగులకు నిత్యావసరాలు ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
ఇదీచదవండి: ఆస్పత్రుల్లో సిబ్బందిని యుద్ధప్రాతిపదికన నియమించాలి:కిషన్ రెడ్డి