స్వచ్ఛభారత్‌లో రాష్ట్రం వరసగా మూడో ఏడాది అగ్రస్థానంలో నిలిచింది. గందగీ ముక్త భారత్ కేటగిరీలో రాష్ట్రం మొదటిస్థానంలో నిలిచినట్లు కేంద్ర తాగునీరు, పారిశుద్ధ్య శాఖ ప్రకటించింది. ఈ మేరకు ఆ శాఖ సంచాలకులు యుగల్ జోషి రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖకు లేఖ పంపారు. 2019 నవంబర్ నుంచి 2020 ఏప్రిల్ 20 వరకు స్వచ్ఛసుందర్ సముదాయక్ శౌచాలయ, 2020 జూన్ 15 నుంచి సెప్టెంబర్ 15 వరకు సముదాయక్ శౌచాలయ అభియాన్ కార్యక్రమాల అమలుకు గాను రాష్ట్రానికి మొదటి స్థానం దక్కింది. తాజాగా ఆగస్టు ఎనిమిదో తేదీ నుంచి వారం రోజుల పాటు గందగీ ముక్త భారత్ కార్యక్రమాన్ని నిర్వహించింది. ఇందులో మంచి ఫలితాలు సాధించిన రాష్ట్రం దేశంలోనే అగ్రస్థానంలో నిలిచింది. తద్వారా వరుసగా మూడు మార్లు మొదటి స్థానాన్ని దక్కించుకొని హ్యాట్రిక్ సాధించినట్లైంది. అటు జిల్లాల విభాగంలో కరీంనగర్ జిల్లా దేశంలోనే మూడో స్థానంలో నిలిచింది.
రాష్ట్రానికి అవార్డు పట్ల సంతోషం వ్యక్తం చేసిన పంచాయతీరాజ్ శాఖా మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు... ముఖ్యమంత్రి కేసీఆర్ చేపట్టిన పట్టణ, పల్లెప్రగతి, మిషన్ భగీరథ వల్లే అవార్డులు దక్కాయని అన్నారు. కేంద్రానికి కృతజ్ఞతలు తెలిపిన ఆయన... ప్రజాప్రతినిధులు, పంచాయతీరాజ్ శాఖ అధికారులు, సిబ్బందిని అభినందించారు. అక్టోబర్ రెండో తేదీన స్వచ్ఛభారత్ దివస్ సందర్భంగా కేంద్ర జలశక్తి శాఖ మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ వర్చువల్ విధానంలో అవార్డులను అందించనున్నారు. పంచాయతీరాజ్ శాఖ కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా అవార్డును స్వీకరించనున్నారు.
ఇవీ చూడండి: వ్యవసాయ యాంత్రీకరణపై సర్కారు నజర్... కమిటీ ఏర్పాటు