Monkeypox Case in AP : విశాఖ నగరంలోని ఓ ప్రైవేట్ మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ ఆఖరి సంవత్సరం చదువుతున్న ఓ వైద్య విద్యార్థినిలో.. మంకీపాక్స్ లక్షణాలున్నట్లు వైద్యాధికారులు గుర్తించారు. వైద్య విద్యార్థిని కొన్ని రోజులుగా ఆస్పత్రిలో చికిత్స పొందుతుండగా.. ఆమె శరీరం, వేళ్లపై దద్దుర్లు కనిపించాయని వైద్యులు తెలిపారు. ఇవి మంకీపాక్స్ వ్యాధి లక్షణాలుగా అనిపిస్తుండడంతో.. వైద్య కళాశాల అధికారులు జిల్లా వైద్యఆరోగ్య శాఖ కార్యాలయానికి సమాచారం అందించారు.
దీంతో ఆరోగ్య శాఖ అప్రమత్తమైంది. ఈ విషయాన్ని అధికారులు విశాఖ కలెక్టర్ మల్లికార్జున దృష్టికి తీసుకెళ్లారు. కలెక్టర్ ఆదేశాల మేరకు.. ఆ వైద్య కళాశాలకు ర్యాపిడ్ రెస్పాన్స్ టీమ్ ను పంపాలని ఆంధ్రా మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ బుచ్చిరాజుకు జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారిణి డాక్టర్ విజయలక్ష్మి లేఖ రాశారు. కళాశాలలోని మెడిసిన్, డెర్మటాలజీ, ఎస్పీఎం, మైక్రోబయాలజీ విభాగాల అసిస్టెంట్ ప్రొఫెసర్లు, ఇద్దరు టెక్నీషియన్లతో కూడిన బృందాన్ని శుక్రవారం మధ్యాహ్నం వైద్య కళాశాలకు పంపించారు.
నేడు నమూనాల సేకరణ : మంకీపాక్స్ అనుమానిత లక్షణాలతో బాధపడుతున్న విద్యార్థిని నుంచి నమూనాలు సేకరించి.. పుణెలోని వైరాలజీ ల్యాబ్‌కు పంపనున్నారు. ప్రస్తుతానికి ఇది అనుమానమేనని.. అయినప్పటికీ అప్రమత్తంగా ఉన్నామని వైద్య అధికారులు తెలిపారు. ఇటీవల విద్యార్థినిని కలిసిన వారి వివరాలను అధికారులు ఆరా తీస్తున్నారు. విద్యార్థిని కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు.