Surrender of 700 Maoist sympathizers: ఆంధ్రప్రదేశ్‌లో ఆంధ్ర ఒడిశా సరిహద్దులోని బోండా ఘాట్‌లో శనివారం దాదాపు 700 మంది మావోయిస్టు సానుభూతిపరులు పోలీసుల ఎదుట లొంగిపోయారు. పోలీసులు ఈరోజు ఆంధ్రహల్ గ్రామ సమీపంలో గల 65 బీఎస్ఎఫ్ బెటాలియన్ శిబిరం వద్ద సానుభూతిపరుల లొంగుబాటు కార్యక్రమం ఏర్పాటు చేశారు. కోరాపుట్ పోలీస్ డీఐజీ రాజేష్ పండిట్, బీఎస్ఎఫ్ డీఐజీ మదన్‌లాల్ తదితరులు సమక్షంలో వివిధ గ్రామాల ప్రజలు లొంగిపోయారు.
ఇందులో భాగంగా ఒడిశా కోరాపుట్, మల్కన్‌గిరి జిల్లాతో పాటు.. అల్లూరి జిల్లా రంగబయలు పంచాయతీకి చెందిన పట్న పడాల్పుట్, కోసంపుట్ గ్రామాలకు చెందిన వారుసైతం ఉన్నారు. మొత్తం 700 మంది లొంగిపోగా అందులో 13మంది రాష్ట్రానికి చెందిన వారని పోలీసులు తెలిపారు. మారుమూలప్రాంతాల్లో అభివృద్ధికి పోలీసులతో కలిసి పని చేస్తామని వారంతా హామీ ఇచ్చారు.
అనంతరం పోలీసులు గిరిజనులకు పలు సామగ్రి పంపిణీ చేశారు. భారీ స్థాయిలో సానుభూతిపరులు లొంగిపోవడంతో ఈ ప్రాంతంలో మావోయిస్టులపై ప్రభావం చూపనుందని పోలీసులు తెలిపారు.