కృష్ణా జలాల వివాదంపై ఏపీ ప్రభుత్వం వేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టు విచారణ జరిపింది. మధ్యవర్తిత్వం ద్వారా సమస్య పరిష్కరించుకోవాలని సీజేఐ జస్టిస్ రమణ తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలకు సూచించారు. రెండు రాష్ట్రాలతో సంప్రదించి పిటిషన్‌పై నిర్ణయం తీసుకోవాలని ఇరు ప్రభుత్వాల సీనియర్ న్యాయవాదులకు చెప్పారు.
ఏపీ పిటిషన్‌పై విచారణ అవసరం లేదని తెలంగాణ తరఫు న్యాయవాది అభిప్రాయపడ్డారు. ఇప్పటికే కేంద్ర గెజిట్ జారీ చేసిందని తెలిపారు. అక్టోబర్ నుంచి గెజిట్ అమల్లోకి వస్తుందని కోర్టుకు చెప్పిన ఏపీ తరఫు న్యాయవాది... ఇప్పటినుంచే గెజిట్ అమలు చేయాలని కోరారు. 4 నెలలపాటు నీటిని నష్టపోకూడదనే అడుగుతున్నామని కోర్టుకు వివరించారు.
తాను రెండు రాష్ట్రాలకు చెందిన వ్యక్తినన్న జస్టిస్ ఎన్.వి.రమణ.. ఇది ఫెడరల్ స్ఫూర్తితో వ్యవహరించాల్సిన విషయమని, తాను రెండు రాష్ట్రాలకు చెందిన వాడినఅని అన్నారు. ఈ వివాదాన్ని మధ్యవర్తిత్వం ద్వారా పరిష్కరించుకుంటే మంచిదని సూచించారు. లీగల్‌గానే వెళ్లాలి అంటే మరో ధర్మాసనానికి బదిలీ చేస్తానని పేర్కొన్నారు.
ప్రస్తుతం ఈశాన్య రాష్ట్రాల్లో పరిస్థితి ఎలా ఉందో చూస్తున్నామని ఏపీ న్యాయవాది దుష్యంత్ అనగా.. మనమంతా సోదరులమని.. అలాంటి పరిస్థితి రాదని జస్టిస్ ఎన్వీరమణ భరోసానిచ్చారు. రెండు ప్రభుత్వాలతో సంప్రదింపులు జరిపి తగిన నిర్ణయం తీసుకోవాలని సూచించిన సీజేఐ.. విచారణను బుధవారానికి వాయిదా వేశారు.