ఆర్టీసీ కార్మికుల సమ్మెకు మద్దతుగా సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి, మాజీ శాసన సభ్యులు కూనంనేని సాంబశివరావు మగ్దూంభవన్‌లో చేపట్టిన నిరవధిక నిరాహార దీక్షను సుధాకర్ రెడ్డి ప్రారంభించారు. దీక్షకు మద్దతుగా తెజస అధ్యక్షుడు కోదండరామ్, ఆర్టీసీ జేఏసీ కో కన్వీనర్ రాజిరెడ్డి, సీపీఎంతో పాటు పలు కార్మిక సంఘాలు పాల్గొన్నాయి.
ఆర్టీసీ ఆస్తులు కాజేసేందుకే..: సురవరం
ఆర్టీసీ కార్మికుల కుటుంబాలు ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నాయని సీపీఐ జాతీయ మాజీ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్ రెడ్డి తెలిపారు. ఉద్యోగం, జీతాల బాధతో కొందరు కార్మికుల గుండెలు ఆగిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ సాధనలో కీలకంగా వ్యవహరించిన వారినే కేసీఆర్ అణగదొక్కుతున్నారని చెప్పారు. ఆర్టీసీ ఆస్తులను కాజేసేందుకే సీఎం కేసీఆర్ కుట్ర పన్నారని ఆరోపించారు.
చర్చలు సామరస్యంగా నిర్వహించాలి: రాజిరెడ్డి
ప్రభుత్వం మొండి వైఖరిని అవలంభిస్తోందని ఆర్టీసీ కో కన్వీనర్ రాజిరెడ్డి విమర్శించారు. యూనియన్‌లు వద్దంటున్న కేసీఆర్ ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తే సీఎం కోరిక తీరుతుందన్నారు. చర్చలు సామరస్యంగా నిర్వహించాలని...కంటి తడుపుగా నిర్వహిస్తే ఊరుకోబోమని ఆయన అన్నారు.
శతృవుల్లా చూడొద్దు: కూనంనేని
ఉద్యమం చేసి సాధించుకున్న తెలంగాణలో ఇలాంటి కార్మికుల సమస్యలు వస్తాయని ఊహించలేదని ఆమరణ దీక్ష చేస్తున్న సీపీఐ నేత కూనంనేని సాంబశివరావు అన్నారు. ముఖ్యమంత్రి తండ్రిలాగా వ్యవహరించాలన్నారు. ఆర్టీసీకార్మికుల డిమాండ్ల సాధ్యాసాధ్యాలు చర్చించి తెలపాల్సింది పోయి... శత్రువులను చూసినట్లు చూడటం సరికాదన్నారు. ఎనిమిది గంటలు దృష్టి మరల్చకుండా పని చేసే కార్మికులు కేవంల ఆర్టీసీ కార్మికులేనని స్పష్టం చేశారు.
మొండిపట్టు వీడాలి: కోదండరాం
చర్చలకు ఆహ్వానించి సమస్యను పరిష్కరించాలన్న చిత్తశుద్ధి ప్రభుత్వానికి లేదని ఆచార్య కోదండరాం విమర్శించారు. ఇవాళ జరిగే సమావేశంలోనైనా పరిష్కారం చూపే బాధ్యత ప్రభుత్వంపై ఉందని ఆయన అన్నారు. ప్రభుత్వం మొండిపట్టు వీడి శాంతియుతంగా ఆర్టీసీ కార్మికుల సమస్యకు పరిష్కారం చూపాలని కోరారు.
అప్పుల్లో ఉన్న ప్రభుత్వాన్ని ఏం చేయాలి: చాడ
పార్టీ నిర్ణయం మేరకు కూనంనేని సాంబశివరావు ఆమరణ దీక్షకు దిగడం పట్ల సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్ రెడ్డి కృతజ్ఞత తెలియజేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ హుజూర్నగర్ ఉపఎన్నికల ఫలితాల అనంతరం అక్కసుతో మాట్లాడరన్నారు. ఆర్టీసీ నష్టాల్లో ఉండే దాన్ని మూసేస్తా అంటే.. ప్రభుత్వం వేల కోట్ల రూపాయల్లో అప్పుల్లో ఉందని.. మరి దానిని ఏం చేస్తారని ప్రశ్నించారు. ఆర్టీసీ కార్మికుల సమస్యను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని కోరారు.