Sucharitha: ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తున్నట్లు కార్యకర్తలకు వెల్లడించారు. పార్టీ కార్యకర్తలతో సమావేశమైన సుచరిత... కార్యకర్తల సమావేశంలో రాజీనామా విషయం ప్రకటించారు. అయితే పార్టీలోనే కొనసాగుతున్నట్లు స్పష్టం చేశారు. నాయకులు ఎవరూ పార్టీకి నష్టం కలిగించవద్దని విన్నవించుకున్నారు. మిగతా క్యాడర్ ఎవరూ రాజీనామాలు చేయొద్దని సుచరిత సూచించారు. మేకతోటి సుచరితకు మద్దతుగా పలువురు ప్రజాప్రతినిధులు రాజీనామా చేస్తున్నట్లు తెలిపారు.
‘వైకాపాలో రెడ్లకో న్యాయం, ఎస్సీలకో న్యాయమా?’ అని మాజీ హోంమంత్రి మేకతోటి సుచరిత వర్గీయులు.. ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మంత్రి పదవి రాలేదని అలిగిన బాలినేని శ్రీనివాసరెడ్డి ఇంటికెళ్లి బుజ్జగించిన సజ్జల.. ఎస్సీ మహిళ అయిన సుచరిత కుటుంబీకులకు కలిసే అవకాశమూ ఇవ్వలేదని విరుచుకుపడ్డారు. సుచరితకు మంత్రివర్గంలో స్థానం కల్పించకపోవడంపై గుంటూరు జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గ వైకాపా నేతలు, కార్యకర్తలు ఆదివారం గుంటూరులో ఆందోళనకు దిగారు. తొలుత సుచరిత ఇంటిముందు బైఠాయించి సజ్జలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అనంతరం లాడ్జి సెంటరు ప్రధాన రహదారిపై టైర్లు తగులబెట్టి ట్రాఫిక్‌ను నిలిపివేసి ఆందోళన చేశారు. సుచరితకు సర్దిచెప్పేందుకు ఎంపీ మోపిదేవి వెంకటరమణారావు ప్రయత్నించగా.. సుచరిత వర్గీయులు అడ్డుకున్నారు.
డౌన్‌డౌన్ సజ్జల, జిందాబాద్ జగన్ అంటూ నినాదాలు హోరెత్తించారు. అధిష్ఠానం ఆదేశాల మేరకు రాత్రి 8.30 సమయంలో సుచరితతో మాట్లాడేందుకు వచ్చిన రాజ్యసభ సభ్యుడు మోపిదేవి వెంకటరమణను కార్యకర్తలు అడ్డుకున్నారు. ఆయన పోలీసుల రక్షణ మధ్య ఇంట్లోకి వెళ్లి సుచరితతో మాట్లాడారు. సమీకరణాలతో కొందరికి మంత్రి పదవులు దక్కలేదని, సుచరితకు న్యాయం జరుగుతుందని చెప్పారు. తన తల్లి శాసనసభ్యత్వానికి రాజీనామా చేస్తున్నారని, పార్టీకి మాత్రం కాదని సుచరిత కుమార్తె రిషిత ఆదివారం రాత్రి మీడియాకు వెల్లడించారు.
పత్రికల్లో ప్రచారానికేనా?: ఎస్సీ మహిళకు హోంమంత్రి పదవి ఇవ్వడం, చెల్లి అనడం పత్రికల్లో ప్రచారానికేనా అని కార్యకర్తలు విరుచుకుపడ్డారు. సుచరితను మంత్రిపదవి నుంచి తప్పించటం వెనక సజ్జల కుట్ర ఉందని ఆరోపించారు. సుచరితను మంత్రివర్గంలోకి తీసుకోకపోతే ఆమెను స్వతంత్ర అభ్యర్థిగా నిలబెట్టి గెలిపించుకుంటామని, తమ పదవులకు రాజీనామాలు చేస్తామని నియోజకవర్గానికి చెందిన పలువురు జడ్పీటీసీ, ఎంపీటీసీ సభ్యులు, ఎంపీపీలు, కార్పొరేటర్లు, మండల పార్టీ కన్వీనర్లు హెచ్చరించారు.
భర్తను వారంలోపే బదిలీ చేసినా..: ఐఆర్‌ఎస్ అధికారి అయిన సుచరిత భర్తకు పోస్టింగ్ ఇచ్చి వారం తిరగకుండానే బదిలీ చేసి ఇబ్బందులు పెట్టినా మానసిక క్షోభను అనుభవిస్తూనే ఆమె పార్టీలో కొనసాగారని పలువురు నాయకులు పేర్కొన్నారు. ‘మీకు విలువ లేని చోట మీరుండొద్దు. మీ వెంట మేం నడుస్తాం. మీరు తీసుకునే నిర్ణయానికి కట్టుబడి ఉంటాం’ అని పెదనందిపాడు పార్టీ మండల కన్వీనర్ మదమంచి శ్రీనివాసరావు, కార్పొరేటర్లు సాంబిరెడ్డి, వెంకటప్పారెడ్డి, కృష్ణారెడ్డి, పద్మ తదితరులు ప్రకటించారు. ఇంటి వద్ద పలువురు ఆందోళన చేస్తున్నా సుచరిత మాత్రం బయటకు రాలేదు.
ఇదీ చదవండి: AP New Ministers Swearing Ceremony: కొలువుదీరిన సీఎం జగన్ కొత్త టీం..