రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీ గురుకుల డిగ్రీ కళాశాలల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన టీజీయూజీ సెట్ 2021 ఫలితాలు నేడు విడుదల చేయనున్నట్లు ఎస్సీ, ఎస్టీ గురుకుల సొసైటీ కార్యదర్శి ప్రవీణ్‌కుమార్ తెలిపారు. సీట్ల భర్తీకి ఈ నెల 19 నుంచి 21 వరకు తొలివిడత కౌన్సెలింగ్ చేపట్టనున్నట్లు పేర్కొన్నారు. అభ్యర్థులు టీసీ, కుల, ఆదాయ ధ్రువీకరణ పత్రాలు, ఇంటర్ మార్కుల మెమో, పాస్‌పోర్టు ఫొటోలతో కౌన్సెలింగ్‌కు హాజరుకావాలని సూచించారు.
బీపెడ్, డీపెడ్ దరఖాస్తుల గడువు పొడిగింపు..
వ్యాయామ కోర్సులు, ఎడ్‌సెట్ ప్రవేశ పరీక్షలకు ఆన్లైన్ దరఖాస్తుల గడువు మరోసారి పొడిగించారు. బీపెడ్, డీపెడ్కు దరఖాస్తుల గడువు ఈనెల 31 వరకు పొడిగించినట్లు కన్వీనర్ ప్రొఫెసర్ సత్యనారాయణ తెలిపారు. ఇవాళ్టి వరకు బీపెడ్కు 1988, డీపెడ్కు 1544 కలిపి... మొత్తం 3462 దరఖాస్తులు వచ్చినట్లు కన్వీనర్ వెల్లడించారు. బీఈడీ ప్రవేశాల కోసం ఎడ్‌సెట్‌కు ఆలస్య రుసుము లేకుండా దరఖాస్తు చేసే గడువు ఈ నెల 22 వరకు పొడిగించినట్లు కన్వీనర్ తెలిపారు.
పాలిసెట్ పరీక్షకు సర్వం సిద్ధం...
కరోనా నిబంధనలు, జాగ్రత్తలతో పాలిసెట్ ప్రవేశపరీక్ష నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు రాష్ట్ర సాంకేతిక విద్యా మండలి కార్యదర్శి శ్రీనాథ్ తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా 411 కేంద్రాల్లో ఈనెల 17న ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం ఒకటిన్నర వరకు పాలిసెట్ నిర్వహించనున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఈ ఏడాది లక్ష 2 వేల 496 మంది పరీక్షకు దరఖాస్తు చేశారని.. వారిలో 58 వేల 616 మంది బాలురు కాగా.. 43 వేల 880 మంది బాలికలు ఉన్నట్లు శ్రీనాథ్ తెలిపారు. ఉదయం పది గంటల నుంచి కేంద్రాల్లోకి అనుమతిస్తామని... 11 తర్వాత ఒక్క నిమిషం ఆలస్యమైనా అనుమతించేది లేదని కార్యదర్శి స్పష్టం చేశారు. గూగుల్ ప్లే స్టోర్ నుంచి ఎస్బీటీఈటీ మొబైల్ యాప్ డౌన్లోడ్ చేసుకొని.. దాని ద్వారా పరీక్ష కేంద్రం లొకేషన్‌ను తెలుసుకోవచ్చునన్నారు.