Students Protest in Vijayawada : తమ న్యాయమైన డిమాండ్ల సాధన కోసం పోరాడతామన్న విద్యార్థి సంఘం నాయకులు.. అక్రమ అరెస్టులతో తమ ఉద్యమాన్ని ఆపలేరని అన్నారు. శాంతియుతంగా ఆందోళన చేస్తుంటే అడ్డుకుంటారా అని ప్రశ్నించారు. నిరుద్యోగ భృతి లేదు.. ఉద్యోగాలు లేవని ధ్వజమెత్తారు.
విజయవాడ ధర్నాచౌక్‌లో...
AP Students Protest for Job Calendar: విజయవాడ ధర్నాచౌక్‌లో నిరుద్యోగ, యువజన సంఘాలు చేపట్టిన ధర్నాపై పోలీసులు ఉక్కుపాదం మోపారు. ధర్నాచౌక్‌కు చేరుకున్న నిరుద్యోగ యువత, యువజన సంఘాల నేతలను అరెస్ట్ చేశారు. ఏపీ ప్రభుత్వ శాఖల్లో ఖాళీ పోస్టులకు తక్షణమే నోటిఫికేషన్ విడుదల చేయడంతో పాటు.. ఉద్యోగం వచ్చేవరకు 5 వేలు నిరుద్యోగ భృతి ఇవ్వాలని డిమాండ్ చేస్తూ యువజన సంఘాలు ధర్నాకు పిలుపునిచ్చాయి. మెగా డీఎస్సీ ద్వారా 25 వేల టీచర్ పోస్టుల భర్తీ చేయాలని నిరుద్యోగులు డిమాండ్ చేశారు.
AP Students Protest for Jobs: విద్యార్థి జేఏసీ ఆధ్వర్యంలో చేపట్టిన ధర్నాకు తెదేపా మద్దతు తెలిపింది. ధర్నా చౌక్ వద్దకు చేరుకున్న తెలుగు యువత నాయకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఉద్యోగ నోటిఫికేషన్ గురించి అడిగితే ప్రభుత్వం నిరుద్యోగులను జైలులో పెట్టి హింసిస్తోందని తెలుగు యువత అధ్యక్షుడు శ్రీరామ్ చినబాబు మండిపడ్డారు.
శ్రీకాకుళంలో యువత ధర్నా
AP Students Protest for Job Notifications: శ్రీకాకుళంలోనూ తెదేపా ఆధ్వర్యంలో యువత ధర్నా చేపట్టింది. ఉద్యోగ క్యాలెండర్ విడుదల చేయాలంటూ 7 రోడ్ల కూడలిలో నిరుద్యోగులు చేపట్టిన ధర్నాను పోలీసులు భగ్నం చేశారు. యువజన సంఘాల నాయకులను పోలీసులు అదుపులోకి తీసుకుని పోలీసుస్టేషన్‌కు తరలించారు.
విజయనగరంలో నిరసన
రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ఉద్యోగాలు భర్తీ చేయాలని కోరుతూ ఉద్యోగ పోరాట సమితి విజయవాడలో చేపట్టిన మహా ధర్నాకు మద్ధతుగా.. విజయనగరం జిల్లా ఉద్యోగ పోరాట సమితి నిరసన తెలియచేసింది. ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా చేపట్టిన నిరసనలో యువజన సంఘాలు పాల్గొన్నాయి.
తిరుపతిలో ర్యాలీ
తిరుపతిలో అన్నమయ్య కూడలి నుంచి ఆర్డీఓ కార్యాలయం వరకు నిరుద్యోగులు ర్యాలీ నిర్వహించారు. ఆర్డీఓ కార్యాలయం ఎదుట బైఠాయించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అసెంబ్లీ సమావేశాల్లో ఉద్యోగ క్యాలెండర్ పై చర్చించాలని డిమాండ్ చేశారు. వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలోని నిరుద్యోగ యువతకు ఎటువంటి మేలు జరగలేదని ధ్వజమెత్తారు