విద్యా సంస్థలకు సెలవుల పొడిగింపుపై విద్యార్థులు తల్లిదండ్రుల్లో గందరగోళం నెలకొంది. ఆర్టీసీ కార్మికుల సమ్మె నేపథ్యంలో విద్యా సంస్థలకు ఈనెల 19 వరకు దసరా సెలవులు పొడిగిస్తున్నట్లు ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు. ప్రభుత్వం ఈ మేరకు ఉత్తర్వులు కూడా జారీ చేసింది. అయితే రాష్ట్రంలోని పలు ప్రైవేటు, కార్పొరేటు విద్యాసంస్థలు రేపటి నుంచే తరగతులు ప్రారంభించాలని నిర్ణయించుకున్నాయి. రేపటి నుంచి తరగతులకు హాజరుకావాలని విద్యార్థుల తల్లిదండ్రులకు మెసేజ్లు పంపించాయి.
ప్రభుత్వ గురుకుల జూనియర్ కాలేజీలు, పాఠశాలల్లో సెలవుల పొడిగింపుపై సొసైటీ కార్యదర్శి ఆర్ఎస్. ప్రవీణ్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. వెనువెంటనే సవరించారు. ఇప్పటికే సుమారు 75 శాతం విద్యార్థులు హాస్టళ్లకు చేరుకున్నారని వారిని తిరిగి ఇళ్లకు పంపిస్తే ఇబ్బంది పడతారని పేర్కొన్నారు. కాబట్టి రేపటి నుంచి తరగతులు ప్రారంభించనున్నట్లు మొదటి ఉత్తర్వులో తెలిపారు. తదనంతరం విడుదల చేసిన సవరించిన ఉత్తర్వుల్లో గురుకుల పాఠశాలలకు సెలవులు ఈ నెల 19వ తేదీ వరకు కొనసాగుతాయని వెల్లడించారు. గురుకుల కాలేజీలకు మాత్రం సెలవుల పొడిగింపు లేదని పేర్కొన్నారు.
మరోవైపు ప్రభుత్వ ఉత్తర్వులు కచ్చితంగా పాటించాలని... రేపటి నుంచి తరగతులు ప్రారంభిస్తే.. కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తూ పాఠశాల విద్యాశాఖ, ఇంటర్ బోర్డు, యూనివర్సిటీలు వేర్వేరుగా ఉత్తర్వులు జారీ చేశాయి.
ఇదీ చదవండిః దసరా సెలవులు మరోవారం పొడిగింపు