Narayana College Incident: హైదరాబాద్‌లోని నారాయణ కళాశాల ఘటనలో గాయపడిన విద్యార్థి నాయకుడు సందీప్‌కు ఏమైనా జరిగితే కళాశాల ముందే కుటుంబంతో సహా ఆత్మహత్య చేసుకుంటామని తండ్రి యాదయ్య అన్నారు. తన కొడుకు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడని ఇప్పటికీ అతని పరిస్థితి విషమంగానే ఉందని పేర్కొన్నారు. కళాశాలలో జరిగిన ఘటనకు యాజమాన్యమే బాధ్యత వహించాలన్నారు. ఇప్పటి వరకు అధికారులెవరూ స్పందించలేదని వాపోయారు. ప్రస్తుతం సందీప్ కంచన్‌బాగ్ డీఆర్డీవో ఆసుపత్రిలోని ఐసీయూలో చికిత్స పొందుతున్నాడు.
"నా కొడుకు అదే కాలేజీలో చదువుకున్నాడు. అక్కడున్న ప్రిన్సిపల్, ఉపాధ్యాయులు తెలిసినవాళ్లని.. వేరే విద్యార్థికి సాయం చేసేందుకు వెళ్లాడు. నా కొడుకుకు ఏమైన జరగరాంది జరిగితే కుటుంబమంతా ఆత్మహత్య చేసుకుంటాం. కాలేజీలో జరిగిన ఘటనకు యాజమాన్యమే బాధ్యత వహించాలి." - యాదయ్య, సందీప్ తండ్రి
రామాంతాపూర్‌లోని నారాయణ కళాశాలలో చదివిన ఓ విద్యార్థికి టీసీ ఇప్పించటం విషయంలో విద్యార్థి నాయకుడు సందీప్, ప్రిన్సిపల్‌కు మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. ఫీజు విషయం, టీసీ గురించి మాట్లాడుతుండగా ప్రిన్సిపల్‌ను బెదిరించేందుకు సందీప్ తనతో తీసుకొచ్చిన పెట్రోల్‌ను ఒంటిపై పోసుకున్నాడు. కృష్ణాష్టమి వేళ వెలిగించిన దీపం పక్కనే ఉండటంతో సందీప్‌కు మంటలు అంటుకున్నాయి. మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నించిన ప్రిన్సిపల్ సుధాకర్‌రెడ్డి, ఏవో అశోక్‌రెడ్డి గాయపడ్డారు. ఈ ఘటనతో ప్రిన్సిపల్ గదిలో మంటలు అంటుకుని ఏసీతో పాటు అక్కడి సామగ్రి కాలిపోయాయి. కుర్చీలు, ఇతర వస్తువులు దగ్ధమయ్యాయి. బాధితులను ఆస్పత్రికి తరలించారు.
సంబంధిత కథనం: