పదో తరగతి, ఇంటర్ పరీక్షలు రద్దు చేసినట్లు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సుప్రీంకోర్టుకు నివేదించింది. ఈ మేరకు ఆ రాష్ట్ర ప్రభుత్వ తరఫు న్యాయవాది దుష్యంత్ దవే సుప్రీంకోర్టుకు సమాచారం అందించారు. మార్కుల గురించి తేల్చడానికి ఉన్నతస్థాయి కమిటీ వేయనున్నట్లు వివరించారు. జులై ఆఖరులో పరీక్షలు నిర్వహిస్తామని ప్రభుత్వం ప్రకటించిన నేపథ్యంలో.. విద్యార్థుల తరఫున సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. దీనిపై విచారణ చేపట్టిన న్యాయస్థానం.. అఫిడవిట్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది.
విచారణ సందర్భంగా..
ఈ అంశంపై గురువారం విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు ముఖ్యమైన 5 అంశాలేవీ అఫిడవిట్‌లో లేవంటూ ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. కొవిడ్ కొనసాగుతున్న పరిస్థితుల్లో పరీక్షలు ఎలా నిర్వహిస్తారని, దేశమంతా రద్దు చేసినా మొండిగా ముందుకెళ్లడానికి కారణమేంటని నిలదీసింది. పరీక్షలు జరుగుతున్న సమయంలో మూడో వేవ్ వస్తే ఏం చేస్తారని ప్రశ్నించింది. కరోనా పరిస్థితుల్లో పూర్తిస్థాయి జాగ్రత్తలు తీసుకోవడం సాధ్యమేనా అని అడిగింది. కరోనా కారణంగా ఒక్క విద్యార్థి ప్రాణం పోయినా రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత వహించాలని.. ఒకవేళ ఎవరైనా చనిపోతే కోటి రూపాయల పరిహారం ఇవ్వాలని నిర్దేశించింది.
రద్దుకు నిర్ణయం..
ఈ పరిస్థితుల్లో విద్యాశాఖ మంత్రి, ఉన్నతాధికారులతో గురువారం సాయంత్రం సమీక్ష చేసిన ఏపీ ముఖ్యమంత్రి జగన్ పరీక్షలు రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఇదే అంశాన్ని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. మార్కుల గురించి తేల్చడానికి ఉన్నతస్థాయి కమిటీ వేయనున్నట్లు వివరించారు.
ఇదీ చదవండి: Cm Kcr: ఎస్సీల మీద చేయి పడితే ప్రభుత్వం ఊరుకోబోదు: సీఎం