ఈశాన్య భారతదేశంలోని అడవుల్లో వెదురు చెట్లు పుష్కలం. వాటి నుంచి తీసే ద్రవంతో సువాసనలు వెదజల్లే ఫ్రెష్‌నర్ తయారు చేయవచ్చని ఓ యువకుడికి ఆలోచన వచ్చింది. అదొక అంకుర ప్రాజెక్టుగా రూపుదిద్దుకుని పురోగమిస్తోంది. ఇలా వినూత్నంగా ముందంజ వేయాలనుకునే వారికి ‘అంకురం’ మంచి అవకాశం. ఔత్సాహికుల ఆలోచనలకు ఊతమివ్వడానికి జాతీయ వ్యవసాయ, విస్తరణ, నిర్వహణ సంస్థ (మేనేజ్) ముందుకొస్తోంది. తగిన శిక్షణ, మార్కెటింగ్ సహకారంతో పాటు పారిశ్రామికవేత్తల నుంచి పెట్టుబడుల సమీకరణకు కూడా సాయపడుతుంది. దేశవ్యాప్తంగా ‘రాష్ట్రీయ కృషి వికాస్ యోజన- వ్యవసాయం, దాని అనుబంధ రంగాల్లో ఆదాయం పొందే మార్గం’ (ఆర్కేవీవై-ర్యాఫ్టార్) అనే పథకాన్ని కేంద్ర వ్యవసాయశాఖ ‘మేనేజ్’ ద్వారా అమలు చేస్తోంది. ప్రతి రాష్ట్రంలో ఒక్కో అంకుర అభివృద్ధి కేంద్రాన్ని ఏర్పాటు చేస్తోంది. రాష్ట్రంలో హైదరాబాద్ రాజేంద్రనగర్‌లో ఇలాంటి కేంద్రం ఉంది. దీంతో పాటు ‘భారత తృణధాన్యాల పరిశోధన సంస్థ’ (ఐఐఎంఆర్)తోనూ కలిసి పనిచేస్తోంది.
.
అంకురాల అభివృద్ధికి రెండు రకాల కార్యక్రమాలను అమలు చేస్తున్నారు.
1. వ్యవసాయ, వాణిజ్యవేత్తల ఓరియంటేషన్
కొత్త ఆలోచనలతో వచ్చేవారిని వ్యవసాయ వాణిజ్యవేత్తలుగా తీర్చిదిద్దుతారు. వీరి ఆలోచనను అమలులో పెట్టడానికి అవసరమైన ప్రాథమిక మౌలిక సదుపాయాల కల్పన కోసం రూ.5 లక్షలను నేరుగా మంజూరుచేస్తారు. నెలకు రూ.10 వేలు శిక్షణ
భృతి(స్టయిఫండ్) చెల్లిస్తారు. వారి ఆలోచనను క్షేత్రస్థాయిలో అమలుకు చేయాల్సిన పనులపై జాతీయస్థాయి నిపుణులతో 2 నెలల్లో 60 గంటలు శిక్షణ ఇస్తారు. ఇప్పటికే పనిచేస్తున్న ఇతర అంకురాలతో కలసి పనిచేసే అవకాశం కల్పిస్తారు.
2. వ్యవసాయ వాణిజ్య ప్రోత్సాహక కార్యక్రమం
కొత్త ఆలోచనతో మీరు వినూత్నంగా ఏదైనా వ్యాపారం చేస్తున్నారా.. దానివల్ల వ్యవసాయం దాని అనుబంధ రంగాలు, గ్రామీణ ప్రజల జీవనోపాధి మెరుగుకు దోహదపడుతున్నారా.. మీ వాణిజ్యాన్ని మరింత వృద్ధి చేసేందుకు మేనేజ్ రూ.25 లక్షలను ఆర్థిక సాయంగా అందిస్తుంది. ఒకసారి మీ వ్యాపారాన్ని మేనేజ్ సాయం చేయడానికి ఎంపిక చేస్తే రెండేళ్లపాటు మీకు సాంకేతిక సాయం అందిస్తుంది. 8 వారాలు శిక్షణ ఇస్తుంది. నిపుణులతో సలహాలు, సూచనలు ఇప్పించి వ్యాపారాభివృద్ధి జరిగేలా చూస్తుంది.
ఏయే అంశాల్లో అంకురాలను ప్రోత్సహిస్తారంటే...
* విత్తనాలు, ఎరువులు, యంత్రాలు సరఫరా
* పశు సంవర్ధక రంగం
* ఆహార శుద్ధి పరిశ్రమ
* మత్స్య పరిశ్రమ
* సేద్యంలో ఐటీ
* అగ్రి క్లినిక్‌లు
* గోదాముల నిర్వహణ
* పోషకాహారం, వైద్యం
* పాడి పరిశ్రమ
నల్ల బియ్యంతో నూడుల్స్, వెదురుతో రూం ఫ్రెష్‌నర్
ఈశాన్య రాష్ట్రాల్లో సహజ ఉత్పత్తులను సేకరించి ఒక బ్రాండు పేరుతో వ్యాపారం చేయడం వల్ల ఆదాయం వస్తుందన్న భానుప్రతాప్ ఆలోచనను మేనేజ్ ప్రోత్సహించింది. ఆయన అంకురం ఏర్పాటు చేసి వ్యాపారాన్ని ప్రారంభించారు. అడవుల్లో లభించే వెదురుతో గదిలో సువాసనలు వెదజల్లే ఫ్రెష్‌నర్, పనస, జామపండ్ల ఉత్పత్తులు, నల్లబియ్యంతో నూడుల్స్, వేడి చేయగానే వెంటనే కర్రీగా మారే కూరగాయల పొడి, అరటి కాండం రసం తదితరాలను తయారు చేశారు. మార్కెట్లో ఈ ఉత్పత్తులకు మంచి డిమాండ్ ఏర్పడింది.
చెరువులో ఆక్సిజన్ ఎంతుందో..
రొయ్యల చెరువులో ఆక్సిజన్ ఎంతుందో తెలుసుకునే ‘డిసాల్వ్‌డ్ ఆక్సిజన్ మానిటరింగ్’ పరికరాన్ని నెల్లూరుకు చెందిన యు.వినయ్‌కు తయారుచేశారు. ఇంకా చెరువు నీటిలో, పైన వాతావరణంలో ఉష్ణోగ్రతను క్షణంక్షణం తెలిపే పరికరాన్నీ రూపొందించారు.
పశువుల గుర్తింపునకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్
మనిషిని గుర్తించడానికి ఆధార్ కార్డు ఇస్తారు. అది ఇవ్వడానికి వేలిముద్రలు, కనురెప్పలు చిత్రీకరిస్తారు. మరి పశువులను ఇలాగే గుర్తించడం సాధ్యమవుతుందా? హైదరాబాద్‌కు చెందిన కె.కార్తికేయ ఇదే ఆలోచనను అంకురంలా అభివృద్ధి చేశారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)ను ఉపయోగించి సెన్సార్లు ఉన్న కెమెరాతో పశువును ఫొటో తీస్తారు. ఆన్‌లైన్‌లో దాని చిరునామా, యజమాని పేరును ఒకసారి నమోదు చేస్తే డేటా నిక్షిప్తమై ఉంటుంది. దీనివల్ల ప్రభుత్వం రాయితీపై పాడి పశువుల పంపిణీ కార్యక్రమం, వాటి ఆరోగ్యం, ఇతర వివరాల నమోదు సులభమైంది.
ప్రజలకు కూరగాయలు, పండ్లు
సంగారెడ్డి జిల్లా జహీరాబాద్‌కు చెందిన జోజప్ప రైతులు, ప్రజలకు సాయపడే అంకురాన్ని ఏర్పాటు చేశారు. రైతులతో పంటలు సాగుచేయించారు. గ్రామాన్ని క్లస్టర్‌గా తీసుకుని ఏ రైతు ఏ కూరగాయలు ఎంత విస్తీర్ణంలో సేంద్రియ పద్ధతిలో పండించాలో నిర్ణయిస్తారు. పంట ఉత్పత్తులను కోసిన 12 గంటల్లోగా వినియోగదారుల ఇళ్లకు చేరుస్తారు. సంగారెడ్డి జిల్లా కోహీర్ మండలంలో ప్రయోగాత్మకంగా పంటలు సాగు చేయిస్తే సత్ఫలితాలు వచ్చాయి.
అడవి గింజలతో ఆభరణాలు.. విదేశాలకు ఎగుమతులు
గిరిజనులు పూసలతో తయారుచేసిన దండలకు జాతీయ, అంతర్జాతీయ మార్కెట్లలో గిరాకీ ఉందని తమిళనాడులోని కోయంబత్తూరుకు చెందిన సుందర్‌కు వచ్చిన ఆలోచన అంకురంగా ఎంపికైంది. ‘ఆది ద్రావిడర్’ పేరునున్న మహిళా స్వయం సహాయక సంఘం సభ్యులు సేకరించిన గింజలతో దండలు తయారుచేసి మార్కెట్‌లో అమ్మడానికి రూ.24.50 లక్షలు కావాలని సుందర్ ప్రతిపాదనకు మేనేజ్ అంగీకరించింది. 2025కల్లా ఏటా రూ.35 కోట్ల వ్యాపారం చేయాలనేది ఈయన లక్ష్యం.
పొలంలో తేమను గుర్తించే రోబో
ఏపీలోని చిత్తూరు జిల్లా పీలేరుకు చెందిన షేక్ అల్తాఫ్ అనే యువకుడికి వచ్చిన ఆలోచనకు అంకుర గుర్తింపు లభించింది. ఈయన ఇడుపులపాయ ట్రిపుల్ ఐటీలో బీటెక్ చివరి సంవత్సరం చదువుతున్నారు. పైర్లకు ఎంతనీరు అవసరం అనేది తెలిస్తే విద్యుత్తు, జలం ఆదా చేయవచ్చు. ఇందుకోసం నాలుగు చక్రాలతో నడిచే ఆటోమేటిక్ రోబోను తయారు చేశారీయన. ఇది పొలంలో మొక్కల వద్ద తేమ, ఉష్ణోగ్రత ఎంతనే వివరాల్ని సెన్సార్ల ద్వారా గుర్తించి మొబైల్ యాప్‌నకు పంపుతుంది. బిందు సేద్యం విధానాన్ని అనుసరించే పొలాల్లోని గొట్టాల్లో నాజిల్స్ సరిగ్గా పనిచేస్తున్నాయో లేదో కూడా రోబో తెలుపుతుంది.
రైతుల ఆదాయం పెరుగుతుంది
-చంద్రశేఖర్, డైరెక్టర్ జనరల్ మేనేజ్
అంకురాలతో కొత్త పరిజ్ఞానం రైతులకు అందుబాటులోకి వస్తుంది. సహజ వనరులను, హరిత ఇంధనాన్ని వినియోగిస్తూ పర్యావరణ పరిరక్షణకు ఇవి దోహదపడేలా పనిచేస్తున్నాయి.
సులభ సేద్యమే అంకురం
-శరవణన్, సంచాలకుడు
రైతులు, గ్రామీణులు ఎదుర్కొనే సమస్యలను తేలికగా పరిష్కరించుకునేలా చెప్పి అందుకు అనువైన పరికరాలను చూపడమే అంకురం ప్రధానోద్దేశం. సేద్యాన్ని పరిజ్ఞానంతో సులభతరం చేయాలన్నదే ఈ పథకం లక్ష్యం.
నిపుణులతో శిక్షణ
-సాగర్ దేశ్‌ముఖ్, సహాయ ఆచార్యులు,
కొత్త ఆలోచనలున్న వారు మాకు చెబితే అవసరమైన సలహాలు, సూచనలను నిపుణులతో ఇప్పిస్తాం. ప్రతీ శనివారం మేనేజ్ వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో వెబ్‌నార్ జరుగుతుంది.