కరోనా దెబ్బతో అన్ని రకాల వ్యాపార, వాణిజ్య కార్యకలాపాలు స్తంభించడంతో వీధి వ్యాపారులు, సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలపై తీవ్ర ప్రభావం పడింది. వీధి వ్యాపారులు రోడ్డున పడ్డారు. ఎంఎస్‌ఎంఈలు తమ కార్యకలాపాలు కొనసాగకపోవడంతో ఆర్థికంగా దెబ్బతిని నిలదొక్కుకోలేని పరిస్థితులు నెలకొన్నాయి. ఈ దుర్భర పరిస్థితుల్లో ఎంఎస్‌ఎంఈలకు తోడ్పాటు అందించేందుకు కేంద్ర ప్రభుత్వం ఆత్మ నిర్భర్ భారత్ అభియాన్ పథకాన్ని ప్రకటించింది. కానీ బ్యాంకర్లు సక్రమంగా స్పందించకపోవడంతో రుణాలు అందడం లేదు.
క్షేత్ర స్థాయిలో సమీక్ష
కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన ఆత్మ నిర్భర్ భారత్ అభియాన్‌ను అమలు చేయడానికి బ్యాంకర్లలో ఎక్కువ భాగం చొరవ చూపకపోవడంతో రాష్ట్ర ప్రభుత్వం జోక్యం చేసుకుంది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్ గురువారం బ్యాంకర్లు, పరిశ్రమలు, మున్సిపల్ అధికారులు, కలెక్టర్లు తదితర ముఖ్యమైన శాఖల ఉన్నతాధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన ఆత్మనిర్భర్ భారత్ అభియాన్ అమలు తీరు, వీధి వ్యాపారులకు ఎదురవుతున్న ఇబ్బందులు తదితర అంశాలపై క్షేత్ర స్థాయిలో పరిస్థితులపై సమీక్ష నిర్వహించారు.
మినహాయింపు
కరోనా ప్రభావంతో తీవ్రంగా దెబ్బతిన్న ఎంఎస్‌ఎంఈలను, వీధి వ్యాపారులను ఆదుకోవాలని అందుకు... బ్యాంకర్లు తగిన సహకారం అందించాలని సీఎస్ సోమేశ్‌కుమార్ సూచించారు. వీధి వ్యాపారులకు, ఎంఎస్‌ఎంఈలకు ఇచ్చే రుణాలపై విధించే 0.5శాతం స్టాంపు డ్యూటీని మినహాయిస్తూ రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు ఇచ్చింది. ఈ ఏడాది మార్చి నాలుగో తేదీ నాటికి మున్సిపల్, నగర పాలక సంస్థల్లో రిజిస్ట్రేషన్ అయిన వీధి వ్యాపారులకు ఏలాంటి పూచీ కత్తు లేకుండా పదివేల వరకు బ్యాంకర్లు రుణం ఇస్తారు.
అక్టోబరు 31 వరకు అమల్లో...
ఆత్మనిర్భర్ కింద అత్యవసర రుణ సదుపాయం, సీజీఎస్‌ఎస్‌డీ పథకాల ద్వారా సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల వారికి రూ.7,300 కోట్లు, వీధివ్యాపారులకు రూ.350 కోట్ల మేర రుణసాయం అందనుంది. రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం ఇచ్చిన స్టాంపు డ్యూటీ మినహాయింపు ఉత్తర్వులు ఈ ఏడాది అక్టోబరు 31 వరకు అమలులో ఉంటుంది. స్టాంపు డ్యూటీ నుంచి మినహాయింపు ఇవ్వడంతో వేలాది మంది ఎంఎస్‌ఎంఈలకు, వీధి వ్యాపారులకు ప్రయోజనం ఉంటుందని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది.