ఏప్రిల్ నెలలో జరిగే స్టాఫ్ సెలెక్షన్ కమిషన్ ఉద్యోగ పోటీ పరీక్షల కోసం తెలుగు, ఇంగ్లీష్ భాషల్లో టీశాట్ నెట్వర్క్ ఛానళ్లు పాఠ్యాంశాలు ప్రసారం చేయనున్నట్లు సీఈవో ఆర్.శైలేశ్ రెడ్డి ప్రకటించారు. జనవరి 25న లైవ్ ప్రసారాలతో ప్రారంభమై 27వ తేదీ నుంచి ఏప్రిల్ 12వ తేదీ వరకు సాధారణ ప్రసారాలు కొనసాగించాలని నిర్ణయించినట్లు తెలిపారు. స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (ఎస్ఎస్సీ) ఆధ్వర్యంలో దేశ వ్యాప్తంగా వివిధ స్థాయిల్లో ఉద్యోగాల నియామకం కోసం సుమారు 12,328 పోస్టులకు నోటిఫికేషన్ను విడుదల చేసిందని వెల్లడించారు.
కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవెల్ 6,506, హయ్యర్ సెంకడరీ లెవెల్ 5,522 ఉద్యోగాలకు సంబంధించి గెజిటెడ్, నాన్ గెజిటెడ్, జూనియర్, సీనియర్ అసిస్టెంట్, డాటా ఎంట్రీ ఆపరేటర్స్ తదితర ఉద్యోగాల పోటీ పరీక్షలకు తాము అందించే పాఠ్యాంశాలు ఉపయోగపడతాయని సీఈవో శైలేష్ రెడ్డి స్పష్టం చేశారు. పోటీ పరీక్షలపై అవగాహన కల్పించేందుకు అనుభవం కలిగిన సబ్జెక్టు నిపుణులతో ఈ నెల 25 సోమవారం రోజున ప్రత్యేక ప్రత్యక్ష్య ప్రసారాలు ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు రెండు గంటలు జరిగే లైవ్లో సాంకేతిక నిపుణులు అందుబాటులో ఉంటారని తెలిపారు. పరీక్షలు రాసేందుకు సిద్ధమయ్యే అభ్యర్థులు తమ సందేహాలను ఫోన్ ద్వారా 040-23540326, 23540726 టోల్ ఫ్రీ 1800 425 4039 నెంబర్లకు నివృత్తి చేసుకోవచ్చని చెప్పారు.
వారంలో ఐదు రోజులు ఉదయం ఏడు గంటల నుంచి 11 గంటల వరకు నాలుగు గంటల పాటు.. శని, ఆదివారాల్లో గత ఐదు రోజుల ప్రసారాలు కలిపి ఉదయం ఆరు గంటల నుంచి 11 గంటల వరకు, మధ్యాహ్నాం మూడు గంటల నుంచి ఎనిమిది గంటల వరకు పునః ప్రసారాలుంటాయని శైలేశ్ రెడ్డి తెలిపారు. సుమారు 75 రోజుల పాటు 162 పాఠ్యాంశ భాగాలు 424 గంటల పాటు ప్రసారాలు కొనసాగనున్నాయని స్పష్టం చేశారు.
ఎస్.ఎస్.సి పరీక్షలకు హాజరు కావాలనుకునే అభ్యర్థులకు మాక్ టెస్ట్ నిర్వహించాలని నిర్ణయించామని వెల్లడించారు. పరీక్ష రాసే అభ్యర్థులకు ప్రీఫైనల్లా తోడ్పటమే కాకుండా అభ్యర్థి సామర్థ్యాన్ని అంచనా వేసుకునే అవకాశం ఏర్పడనుందని సీఈవో తెలిపారు.
- ఇదీ చూడండి : బాలికల అభ్యున్నతితోనే దేశ ప్రగతి: గవర్నర్ తమిళిసై