శ్రీశైలం జలవిద్యుత్ కేంద్రాన్ని పూర్తిగా ఆధునికీకరిస్తేనే (రెనోవేషన్) మేలని జెన్‌కో సీనియర్ విద్యుత్ ఇంజినీర్లు తాజాగా సూచించారు. ఈ కేంద్రాన్ని నిర్మించి 20 ఏళ్లైనందున పురాతన పరికరాల స్థానంలో అధునాతనమైనవి ఏర్పాటు చేస్తే మరో రెండు దశాబ్దాలకుపైగా ఎలాంటి ఇబ్బందులు లేకుండా నడపవచ్చని వారు అభిప్రాయపడ్డారు. ఇటీవల సంభవించిన అగ్ని ప్రమాదంలో రెండు యూనిట్లు దెబ్బతిన్నాయి. వాటిలో జనరేటర్ వంటి పరికరాలను జపాన్ నుంచి తెప్పించాల్సి ఉంది. అప్పట్లో జపాన్ పరిజ్ఞానంతో నిర్మించడం వల్ల ఇలా మరమ్మతులు అవసరమైనప్పుడల్లా జపాన్ సహా ఇతర దేశాలపై ఆధారపడాల్సి వస్తోంది. ప్రస్తుతం మన దేశంలోనే అధునాతన పరికరాలు లభిస్తున్నందున.. వాటితో ఆధునికీకరిస్తే భవిష్యత్తులో విదేశాలపై ఆధారపడాల్సిన అవసరముండదు. పైగా కేంద్రం కూడా స్వదేశంలో తయారైన విద్యుత్ పరికరాలనే వాడాలని, విదేశాల నుంచి తెప్పించాల్సి వస్తే ముందస్తుగా ఎంపిక చేసిన ప్రయోగశాలల్లో వాటిని పరీక్షలకు పంపాలని ఇటీవల అన్ని రాష్ట్రాలకు ఆదేశాలు జారీ చేసింది.
ముమ్మరంగా మరమ్మతు పనులు
గత నెలలో జరిగిన అగ్నిప్రమాదం వల్ల జల విద్యుత్కేంద్రంలో మరమ్మతు పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. ఈ కేంద్రంలో మొత్తం ఆరు యూనిట్లు ఉన్నాయి. ఒక్కోదాని విద్యుదుత్పత్తి సామర్థ్యం 150 మెగావాట్లు. ఇందులో 1, 2 యూనిట్లలోనే ఈ ఏడాది ఉత్పత్తి సాధ్యమవుతుందని అంచనా. వీటిని ఈ నెలాఖరునాటికి పునఃప్రారంభించాలని జెన్‌కో తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. ఈ నేపథ్యంలో వీటిని హడావుడిగా ప్రారంభించే బదులు మొత్తం ప్లాంటును ఆధునికీకరించడమే ఉత్తమమని సీనియర్ ఇంజినీర్లు సూచించినట్లు తెలుస్తోంది. గరిష్ఠంగా రూ.200 కోట్ల నుంచి 300 కోట్లు ఖర్చుపెడితే ఈ కేంద్రం ఆధునికీకరణ పూర్తవుతుందని వారి అంచనా. దానివల్ల సమీప భవిష్యత్తులో మళ్లీ ప్రమాదాలు జరగకుండా ఆధునిక పరిజ్ఞానంతో విద్యుత్కేంద్రాన్ని నడపవచ్చని భావిస్తున్నారు. శ్రీశైలం ప్రాజెక్టులో ప్రస్తుతం గరిష్ఠస్థాయిలో వరద వస్తోంది.
అగ్నిప్రమాదం జరగకపోతే రోజూ 900 మెగావాట్ల విద్యుదుత్పత్తికి అవకాశముండేది. వేగంగా మరమ్మతులు చేసి రెండు యూనిట్లు పునఃప్రారంభించినా గరిష్ఠంగా 300 మెగావాట్లకు మించి విద్యుదుత్పత్తి సాధ్యం కాదు. మరో నెల దాటితే కృష్ణానదిలో వరద తగ్గిపోతుంది. అప్పటికి ప్లాంటు సిద్ధమైనా విద్యుదుత్పత్తి సాధ్యం కాదు. తిరిగి వచ్చే ఏడాది జులై, ఆగస్టు నెలల్లో నదిలో వరద వచ్చేదాకా ఈ కేంద్రంలో ఉత్పత్తి ఉండదు. అప్పటిదాకా ఖాళీగా ఉంచకుండా ఆధునికీకరణ చేయడం మేలని ఇంజినీర్ల వాదన. దీనిపై జెన్‌కో సీఎండీ దేవులపల్లి ప్రభాకరరావును సంప్రదించగా రెనోవేషన్ చేయాలా, వద్దా అనేది చర్చిస్తున్నామని, ఇంకా నిర్ణయం తీసుకోలేదన్నారు. ప్రస్తుతం మరమ్మతు పనులు వేగంగా చేయిస్తున్నట్లు తెలిపారు. అగ్నిప్రమాదం వల్ల నష్టం పెద్దగా లేదన్నారు. ప్రస్తుతం కృష్ణాలో వరద వస్తున్నందున నాగార్జునసాగర్, జూరాలలో గరిష్ఠంగా విద్యుదుత్పత్తి చేస్తున్నట్లు పేర్కొన్నారు.