Srisailam Project : కృష్ణా నదిపై ఉన్న జలాశయాల్లోకి వరద కొనసాగుతోంది. మళ్లీ జులైలోనే శ్రీశైలం ప్రాజెక్టు నిండనుంది. వరుసగా రెండో ఏడాది జులైలో శ్రీశైలం నిండనుంది. ఆలమట్టి నిర్మాణం తర్వాత ఆగస్టు లేదా సెప్టెంబరులో ఎక్కువసార్లు జలాశయం పూర్తి స్థాయి నీటిమట్టానికి చేరుతోంది. గత ఏడాది మాత్రం జులై 28న ఒక గేటు తెరిచి నీటిని వదలగా, మరుసటిరోజు గేట్లన్నీ ఎత్తి 4 లక్షల క్యూసెక్కులను వదిలారు.
Srisailam Project Flood : 2013 తర్వాత మళ్లీ గత ఏడాది జులైలో నిండగా, ప్రస్తుత వరద ప్రవాహాన్ని పరిగణనలోకి తీసుకొంటే ఈ ఏడాది కూడా జులైలో గేట్లెత్తే అవకాశాలు కనిపిస్తున్నాయి. గత ఏడాది ఆలమట్టి డ్యాంలో నీటి నిల్వకు సంబంధించిన రూల్‌కర్వ్‌కు ఆమోదం తెలిపి పూర్తిగా నీటిని నిల్వ చేయకపోవడమూ ఒక కారణంగా నీటిపారుదలశాఖ వర్గాలు భావిస్తున్నాయి.
కర్ణాటకతోపాటు తుంగభద్ర నుంచి నీరు వస్తోంది. ఆల్మట్టి, నారాయణపూర్ జలాశయాలకు లక్షా 25 వేల క్యూసెక్కుల వరద వస్తుంటే...లక్ష క్యూసెక్కులపైనే దిగువకు వదులుతున్నారు. జూరాల జలాశయానికి లక్షా 60 వేల క్యూసెక్కుల వరద వస్తుండగా.. అంతే మొత్తాన్ని కిందకు వదులుతున్నారు. ప్రస్తుతం జూరాలలో 7.99 టీఎంసీల నీరు ఉంది.
తుంగభద్ర ప్రాజెక్టుకు... ఇన్‌ఫ్లో లక్షా 70 వేల క్యూసెక్కులకుపైగా ఉండగా లక్షా 40 వేలకుపైగా విడిచిపెడుతున్నారు. తుంగభద్రలో 97.83 టీఎంసీల నీరు ఉంది. శ్రీశైలానికి 3 లక్షలా 27వేల క్యూసెక్కులకు వస్తుంటే.. కేవలం 31వేల క్యూసెక్కులు దిగువకు వదులుతున్నారు. శ్రీశైలంలో నీరు 134.95 టీఎంసీలకు పెరిగింది. ఇది జలాశయ సామర్థ్యంలో 63 శాతం. నాగార్జునసాగర్‌లో ప్రస్తుతం 54 శాతం మేర అంటే 169.51 టీఎంసీల నీరు ఉంది.
గోదావరిలోనూ వరద పెరిగింది. ఎగువన కురిసిన వర్షాలకు శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు లక్ష క్యూసెక్కుల వస్తుంటే ఆ మొత్తాన్ని దిగువకు వదులుతున్నారు. ప్రస్తుతం ఎస్సారెస్పీలో 86 శాతం.. 77.38 టీఎంసీల నీరు ఉంది. ఎల్లంపల్లికి 77వేల క్యూసెక్కులు వస్తుంటే లక్ష క్యూసెక్కులు వదులుతున్నారు. ఎల్లంపల్లి ప్రాజెక్టులో 16.99 టీఎంసీల నీరు ఉంది.