తెలంగాణలో చిక్కుకున్న ఇతర రాష్ట్రాలకు చెందిన వలస కూలీలకు దాదాపు రూ.30 కోట్ల వ్యయంతో అవసరమైన సహాయాన్ని రాష్ట్ర ప్రభుత్వం అందించనుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలో జరిగిన అత్యున్నత స్థాయి సమీక్షలో తీసుకున్న నిర్ణయానికి అనుగుణంగా ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో 3,35,669 మంది వలస కూలీలు ఉన్నట్లు గుర్తించారు. ఒక్కో వ్యక్తికి 12 కిలోల రేషన్ బియ్యం, రూ.500 నగదును తక్షణ సాయంగా అందించనున్నారు.
అత్యధికంగా రంగారెడ్డి జిల్లాల్లో 37 వేల మంది, హైదరాబాద్‌లో 34 వేలు, ఖమ్మంలో 30 వేలకు పైగా వలస కూలీలు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఒక్కక్కరికి 12 కిలోల చొప్పున.. రూ.13,18,00,000 విలువైన బియ్యాన్ని పంపిణీ చేస్తారు. ఎవరైనా బియ్యం స్థానంలో గోధుమ పిండి తీసుకున్నా సరఫరా చేస్తారు. ఒక్కో వ్యక్తికి రూ.500 చొప్పున రూ.16 కోట్ల 78 లక్షల ఇస్తారు. మొత్తం రూ.29.96 కోట్లు రాష్ట్ర విపత్తు నిధి, కార్మిక శాఖ సెస్ నుంచి భరించాలని ప్రభుత్వం స్పష్టం చేసింది.
కలెక్టర్ ఆధ్వర్యంలో బియ్యం, నగదు పంపిణీ జరగనుంది. కూలీలకు బ్యాంకు ఖాతాలు ఉంటే నగదును అందులోనే జమచేయాలి. ఖాతాలు లేకుంటే ప్రత్యేక బృందాలను ఏర్పాటుచేసి పంపిణీ చేయాల్సి ఉంటుంది. కూలీలు వంట చేసుకునే పరిస్థితి లేకపోతే వారికి భోజనం పెట్టేలా ఏర్పాట్లు చేయాలని పాలనాధికారులకు ప్రభుత్వం స్పష్టం చేసింది. వారికి అవసరమైన వసతి, మంచినీరు, వైద్య సహాయం కూడా కల్పించాలని పేర్కొంది. విపత్కర సమయంలో వలస కూలీలెవరూ ఆకలితో అలమటించకుండా తగు చర్యలు తీసుకోవాలని కలెక్టర్లను ప్రభుత్వం ఆదేశించింది. ఈమేరకు విపత్తు నిర్వహణ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.
ప్రశంసల వర్షం..
వలస కూలీలను తెలంగాణ అభివృద్ధిలో భాగస్వాములుగా పేర్కొంటూ ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన ప్రకటన, ప్రయత్నాలపై దేశవ్యాప్తంగా అభినందనలు వెల్లువెత్తాయి. పలువురు రాజకీయ, సినీ, మీడియా ప్రముఖులు ఈ మేరకు ముఖ్యమంత్రి కేసీఆర్‌ను, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని అభినందిస్తూ సామాజిక మాధ్యమాల్లో సందేశాలు పెట్టారు.
సంక్షోభ సమయంలో తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ప్రజల హృదయాలను గెలుచుకున్నారు.
- గిరిరాజ్ సింగ్, కేంద్ర పశుసంవర్థక శాఖ మంత్రి ట్వీట్
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రజలకు, వలస కూలీలకు ఇచ్చిన భరోసా అభినందనీయం.
- డాక్టర్ సంజీవ్ బాల్యన్, కేంద్ర సహాయ మంత్రి ట్వీట్
ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటన అద్భుతం.. ఇదీ నాయకత్వం.- సంజయ్ బారు, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మీడియా అడ్వయిజర్
వలస కూలీల విషయంలో వ్యవహరించాల్సిన తీరు ఇదే అని, ఇంత స్పష్టమైన విశ్వాసం కల్పించిన ముఖ్యమంత్రికి ధన్యవాదాలు. -ఏఎన్ఐ. మేనేజింగ్ ఎడిటర్ స్మితా ప్రకాష్.
ఆమె ట్వీట్‌పై పలువురు జాతీయ మీడియా ప్రతినిధులు స్పందించారు.
ఇవీచూడండి: కరోనా ప్రభావం.. వేతనాల్లో కోత