కొవిడ్ కారణంగా ఆర్థిక వ్యవస్థలో వచ్చిన మార్పులు ఉద్యోగాలపై ఎంతో ప్రభావం చూపాయి. ఉద్యోగ పరిస్థితుల్లోనూ ఎన్నో మార్పులు వచ్చాయి. ఏడాది కాలంగా ఉద్యోగ అవకాశాలు భారీగా తగ్గాయి. గత కొద్దినెలల్లో మార్పులు వచ్చినా అవి చాలా తక్కువే. ఎన్నో ఏళ్ల అనుభవం ఉన్నవారూ ఉద్యోగాలను కోల్పోయారు. దీంతో తాజాగా జాబ్ మార్కెట్‌లోకి అడుగు పెట్టేవారికి కెరియర్ ప్రారంభించడం కొంత సవాలుగానే ఉంది. ఎన్నో అధ్యయన నివేదికలూ ఈ విషయాన్ని ధ్రువీకరిస్తున్నాయి.
ఈ పరిస్థితులు యువతలో కొంత భయాందోళనలను కలిగిస్తున్నాయనేది వాస్తవం. అయితే ఇక్కడ గమనించాల్సిందేంటంటే.. ఒక క్లిష్ట పరిస్థితి ఏర్పడినపుడు దానికి అనుగుణంగా మార్పులూ చోటు చేసుకుంటాయి. ఉదాహరణకు కొవిడ్ వ్యాప్తి మొదలైనపుడు దేశమంతా లాక్‌డౌన్ ఏర్పడింది. దేశాల సరిహద్దులన్నీ మూతబడ్డాయి. కానీ తరువాత ఏమైంది? కొన్ని జాగ్రత్తలతో సడలింపులు మొదలయ్యాయి. వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చింది. దేశాల మధ్య రాకపోకలూ మొదలయ్యాయి. పరిస్థితికి అనుగుణంగా కొద్దికొద్దిగా చేసుకున్న మార్పే ఇది. ఉద్యోగార్థులూ అంతే. తాజా ధోరణులకు తగ్గట్టుగా సిద్ధమైతే మళ్లీ అవకాశాలను అందుకోవచ్చు. కాబట్టి, భవిష్యత్తుపై బెంగ మాని, మార్పులు, తాజా ధోరణులకు తగ్గట్టుగా తమని తాము సిద్ధం చేసుకోవడంపై దృష్టిపెట్టాల్సిన సమయమిది! వాటిని ఓసారి పరిశీలిస్తే..
డిజిటల్ మార్కెటింగ్
ఇంటర్నెట్ వంటి డిజిటల్ టెక్నాలజీలను ఉపయోగించి వస్తువుల, సేవలను మార్కెటింగ్ చేయడాన్నే డిజిటల్ మార్కెటింగ్‌గా చెబుతాం. సెర్చ్ ఇంజిన్లు, సోషల్ మీడియా, ఈమెయిల్ మార్కెటింగ్, వీడియో చానళ్లు, బ్లాగులు దీనికి ప్రధాన వేదికలు. లాక్‌డౌన్ సమయంలో నేరుగా వ్యాపారం నిర్వహించే వీలు లేకపోవడంతో దీనికి బాగా ఆదరణ పెరిగింది. సంస్థలన్నీ తమ వ్యాపార కార్యకలాపాలన్నింటినీ డిజిటల్ రూపంలోకి తీసుకొచ్చాయి. దీంతో సంబంధిత నైపుణ్యాలున్నవారి అవసరం ఏర్పడింది. డిజిటల్ మార్కెటింగ్ వ్యూహంతోపాటు డేటా విశ్లేషణ నైపుణ్యాలు ఉన్నవారికి ఇప్పుడు మంచి గిరాకీ ఉంది. డిజిటల్ బిజినెస్ అనాలిసిస్, కంటెంట్ మార్కెటింగ్, సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ మొదలైనవన్నీ వీటిలో భాగమే. ఆన్‌లైన్ వ్యాపారానిదే ప్రధాన భూమిక అవుతున్న నేపథ్యంలో సంస్థలు సంబంధిత నైపుణ్యాలపై దృష్టిపెడుతున్నాయి. కొన్ని సంస్థలు తమవారికే అప్‌స్కిల్లింగ్ అవకాశం కల్పిస్తుండగా ఎక్కువశాతం కొత్తవారికి అవకాశాలు కల్పిస్తున్నాయి. కాబట్టి, అభ్యర్థులు తమ రెజ్యూమెలో ఈ నైపుణ్యాలకు చోటిచ్చేలా చూసుకుంటే మంచిది. ప్రముఖ ఆన్‌లైన్ సంస్థలు వీటికి సంబంధించి ఎన్నో కోర్సులు అందిస్తున్నాయి.
భిన్నంగా ఆలోచిస్తే..
కొంత భిన్నంగా ప్రయత్నించడం.. దీనికి ఎప్పుడూ ఆదరణ ఉంటుంది. పరిస్థితితో సంబంధం లేకుండా కాలానుగుణంగా/ అవసరాలనుబట్టి ప్రతిరోజూ మార్కెట్లోకి వినూత్న ఉత్పత్తులూ, సాంకేతికతలూ, కొత్త తరహా పని విధానాలూ అందుబాటులోకి వస్తుంటాయి. దీంతో సంబంధిత రంగాల మధ్య పోటీ కూడా సాధారణమే. అయితే వస్తున్న మార్పులను అందిపుచ్చుకుంటూ ఉత్తమ సేవలు, వస్తువులను అందరికంటే ముందుగా, భిన్నంగా అందించాల్సి ఉంటుంది. ఇందుకోసం అభ్యర్థుల్లో ఈ నైపుణ్యం కోసం సంస్థలు చూస్తుంటాయి. కాబట్టి, మీ నైపుణ్యాల్లో దీనికీ ప్రాధాన్యమివ్వాలి. నచ్చిన/ కెరియర్‌కు సంబంధించి ఏ అంశంలోనైనా కాస్త భిన్నంగా/ కొత్తగా ప్రయత్నించి చూడాలనే ఆలోచనను అలవాటు చేసుకుంటే సరి. దీన్నీ నేర్చుకునే వీలుంది. కాకపోతే సాధన ద్వారానే సాధ్యమవుతుంది.
భాషా నైపుణ్యంతో..
మిగతావారితో పోలిస్తే.. అదనంగా ఇతర భాష తెలిసుండటం ఎప్పుడూ సానుకూలాంశమే. ఈ నైపుణ్యం రెజ్యూమెకు అదనపు విలువను తెచ్చిపెడుతుంది. రెజ్యూమె పరంగానే కాదు.. కొత్త ఆలోచనలకూ ఇది సాయపడుతుందనేది నిపుణుల మాట. అయితే ఏదో ఒక భాష అని కాకుండా రంగం ఆధారంగా ఎంచుకుంటే ఎక్కువ లాభం ఉంటుందని గుర్తుంచుకోవాలి. విదేశీ/ స్వదేశీ.. ఏ భాషైనా ఇక్కడ ఉపయోగకరమే. కాకపోతే కెరియర్‌కు అదనపు లాభం చేకూరేలా ఉందా అనేది మాత్రం చూసుకోవాలి. ఉదాహరణకు- మీరు ఎంచుకున్న రంగం కార్యకలాపాలు వేరే దేశంతో ఉంటే ఆ దేశానిది, దేశంలోని ఇతర ప్రాంతంతో ఉంటే సంబంధిత రాష్ట్రానికి చెందిన భాషను నేర్చుకోవాలి.
ఉద్యోగపరంగా కొవిడ్ తీసుకొచ్చిన ప్రధాన ధోరణి- స్వల్పకాలిక ఉద్యోగాలు. ఫ్రీలాన్సింగ్, కాంట్రాక్చువల్.. ఎలా పిలిచినా ఈ తరహా ఉద్యోగాలకు డిమాండ్ పెరిగింది. ఖర్చును తగ్గించాలన్న ఉద్దేశంతో చాలావరకూ సంస్థలు ఈ విధానంవైపు మొగ్గు చూపాయి. ఇప్పటికే మార్కెట్‌లో తాజా ఉద్యోగార్థులతోపాటు ఉద్యోగం కోల్పోయినవారూ ఉన్నారు. కాబట్టి, ‘దీర్ఘకాలిక ఉద్యోగాలు వస్తేనే/ వచ్చేవరకూ ఎదురుచూద్దాం’ అన్న ధోరణి మంచిది కాదు. లక్ష్యం అవే అయినప్పటికీ.. వీటినీ అందిపుచ్చుకోవడానికి సిద్ధంగా ఉండాలన్నది నిపుణుల మాట. నిజానికి వీటిలో చేరటమూ ఒకరకమైన పని అనుభవాన్నే ఇస్తుంది. వివిధ సంస్థల పనితీరును తెలుసుకోవడంతోపాటు అప్‌స్కిల్లింగ్ అవకాశమూ వీటి ద్వారా కలుగుతుంది.
అవగాహన అవసరం
ఎంచుకున్న కెరియర్‌ను బట్టి ఒకటి/ రెండు నైపుణ్యాలు అవసరమవుతాయి. విద్యాపరంగానూ చాలామంది వాటిపైనే దృష్టిపెడుతుంటారు. కానీ మారిన పరిస్థితుల దృష్ట్యా బహుళ నైపుణ్యాలు (మల్టిపుల్ స్కిల్స్) ఉన్నవారికి ప్రాధాన్యం పెరుగుతోంది. అంటే.. ఒకే వ్యక్తి సంస్థలో వివిధ విధులను నిర్వహించాలని సంస్థలు కోరుకుంటున్నాయి. కాబట్టి, మీ పనితో సంబంధం ఉన్న ఇతర డిపార్ట్‌మెంట్ల విషయాలపై అవగాహన పెంచుకోవాలి. లేదా పట్టున్న రంగంపైనే కాకుండా దానిలో అవసరమవుతున్న టెక్నాలజీ అంశాలపై అవగాహన పెంచుకోవడం లాంటివీ చూసుకోవాలి. ఉదాహరణకు- మార్కెటింగ్ అభ్యర్థి అనుకుంటే.. మంచి కమ్యూనికేషన్ స్కిల్స్‌తోపాటు సేల్స్ డేటాను సిద్ధం చేయడమూ వారి పనిలో భాగమే. ఇప్పుడు డేటాకు ఎంత ప్రాధాన్యం పెరుగుతోందో తెలిసిన విషయమే. కాస్త ముందడుగు వేసి అదనపు టెక్నాలజీ- డేటా అనాలిసిస్ ప్రాథమికాంశాలను నేర్చుకోవడంపై దృష్టిపెట్టొచ్చు. డేటాసమర్పణకు అవసరమయ్యే పవర్‌పాయింట్, గ్రాఫిక్ డిజైన్.. ఇలా అవసరానికి అనుగుణంగా అదనంగా నేర్చుకోవడంపై దృష్టిపెట్టాలి.
ఒక అవసరం నుంచి వచ్చే చిన్న ఆలోచన ఎన్నో పెద్ద వ్యాపారాలకు కారణమైంది. ఓలా, స్విగీ.. ఇలా చెప్పుకుంటూపోతే బోలెడు ఉదాహరణలు మన ముందుంటాయి. అలా ఏదైనా ఆలోచన మంచి వ్యాపారానికి కారణమవ్వగలదు అనిపిస్తే దాన్ని ప్రయత్నించొచ్చు. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎక్కడో ఏదో ఒక ఉద్యోగం అన్న ధోరణి కంటే సొంత వ్యాపారాన్ని ప్రారంభించడం ఒక మంచి అవకాశమవుతుంది. పైగా ఇంకో నలుగురికి ఉద్యోగావకాశం కల్పించే వీలూ దక్కుతుంది. ఇప్పుడు ఎన్నో సంస్థలు మంచి ఆలోచన, ప్రణాళిక ఉన్నవారికి పెట్టుబడి సాయాన్ని అందిస్తున్నాయి. నమ్మకం ఉంటే.. ఈ దిశగానూ ప్రయత్నించవచ్చు.
ఇదీ చదవండి: బాగానే ఉన్నా జీవితానికి భరోసా కావాలి!