Foreign Affairs special service for labors : పదో తరగతి కంటే ఎక్కువ చదివినవారికి ఈసీఎన్‌ఆర్(ఇమిగ్రేషన్ చెక్ నాన్ రిక్వైర్డ్) పాస్‌పోర్టులను మంజూరు చేస్తున్న విదేశీ వ్యవహారాల శాఖ అంతకంటే తక్కువ చదువుకొని ఉపాధి కోసం విదేశాలకు వెళ్లే వలసదారుల కోసం ప్రత్యేక చర్యలు తీసుకుంటోంది. వీరి కోసమే ఈసీఆర్(ఇమిగ్రేషన్ చెక్ రిక్వైర్డ్) పాస్‌పోర్టుల క్లియరెన్స్ ద్వారా విదేశాలకు వెళ్లే ముందే అక్కడి పరిస్థితులు, స్వీయ రక్షణపై అవగాహన కల్పిస్తోంది. ఇమిగ్రేషన్ వెబ్‌సైట్ (www.eMigrate.gov.in) ద్వారా ఈసీఆర్ పాస్‌పోర్టు దరఖాస్తు చేసుకుంటే రూ.275 ప్రీమియంతో రెండు సంవత్సరాల వ్యవధికి రూ.10లక్షల ప్రవాసీ భారతీయ బీమా కల్పించడంతో పాటు వారు ఆశ్రయించిన ఏజెంట్లు, విదేశాల్లోని కంపెనీల వివరాలు, ధ్రువపత్రాలను పరిశీలించిన అనంతరం పాస్‌పోర్టు క్లియరెన్స్ ఇస్తోంది.
తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన దరఖాస్తుదారుల కోసం హైదరాబాద్ రీజినల్ పాస్‌పోర్టు కార్యాలయంలో ఇమిగ్రేషన్ ప్రొటెక్టర్ అధికారులను నియమించారు. వలసదారుల రక్షణ కోసం వీరు పలు ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. తెలంగాణ, ఏపీ నుంచి ఏటా సగటున 30వేల మంది బ్లూకాలర్ ఉద్యోగాల కోసం విదేశాలకు వెళ్తున్నారు. కొవిడ్ నేపథ్యంలో 2020లో 8వేలు, 2021లో 13వేలు మంది మాత్రమే వెళ్లగా.. ఈ ఏడాది జులై వరకు 20,200 మంది కార్మికులు విదేశాలకు వెళ్లారు. వీరంతా నిర్మాణ రంగంలో, ఎలక్ట్రీషియన్, ప్లంబింగ్, హౌస్ మెయిడ్ వంటి పనుల్లో చేరుతున్నారు.
దేశం నుంచి విదేశాలకు వెళ్లే కార్మికుల విషయంలో తెలుగు రాష్ట్రాలు నాలుగో స్థానంలో ఉన్నాయి. అక్షరజ్ఞానం అంతంతే ఉన్నవారు, నిరక్షరాస్యులు విదేశాల్లో ఇబ్బంది పడకుండా ఉండేందుకు వారికి అక్కడి పరిస్థితులు చెప్పడం .. పాస్‌పోర్టు పోయినా, ప్రమాదానికి గురైనా, ఎవరైనా మృతి చెందినా ఎంబసీని సంప్రదించడం.. ఇమిగ్రేషన్ వెబ్‌సైట్‌లో ఫిర్యాదు చేయడం, హెల్ప్ సెంటర్ల ద్వారా సహాయం కోరడంపై అవగాహన కల్పిస్తున్నారు. ఇందుకోసం 2019 నుంచి ‘ప్రయాణ ముందస్తు పునశ్చరణ, శిక్షణ కార్యక్రమం’(పీడీవోటీ) ఏర్పాటుచేశారు. 8 భారతీయ భాషల్లో పీడీవోటీ పుస్తకాలు సైతం పంచుతున్నారు. దేశంలో 30 నగరాల్లో ఈ కేంద్రాలు ఏర్పాటుచేయగా.. వాటిలో తెలంగాణలోని మాసబ్‌ట్యాంక్‌లో ఓ కేంద్రం ఉంది. ఇప్పటి వరకు సుమారు లక్ష మంది శిక్షణ పొందారు. నకిలీ ఏజెంట్లపై కూడా అవగాహన కల్పిస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో 200 మందికి పైగా నకిలీ ఏజెంట్లు ఉన్నట్లు విదేశాంగ శాఖ గుర్తించింది.
ఆపద సమయంలో ఐసీడబ్ల్యూఎఫ్.. అన్ని భారత రాయబార కార్యాలయాల్లో విదేశాల్లోని భారతీయులకు అత్యవసర సమయాల్లో సహాయపడేందుకు భారత సమాజ సంక్షేమ నిధి(ఐసీడబ్ల్యూఎఫ్) ఏర్పాటుచేశారు. అత్యవసర సమయాల్లో రాయబార కార్యాలయాన్ని సంప్రదించినవారికి భోజనం, వసతి, తిరుగు ప్రయాణానికి టికెట్, అత్యవసర వైద్య సాయం, మృతదేహాల తరలింపు, న్యాయ సహాయం, ప్రవాస భారతీయ, విదేశీయులైన భర్తలతో వేధింపులకు గురయ్యేవారికి న్యాయ, ఆర్థిక సహాయం అందిస్తున్నారు.
ఇవీ చదవండి: 500 కిలోల నగలు ఉన్నా తెల్ల రేషన్ కార్డ్.. కౌన్సిలర్‌కు కోర్టు షాక్
'రూ.41వేల టీషర్ట్ వేసుకుని పాదయాత్ర'.. రాహుల్‌పై భాజపా సెటైర్