Southern Zonal Council Meeting: నేడు త్రివేండ్రంలో దక్షిణాది రాష్ట్రాల జోనల్ కౌన్సిల్ స్థాయీ సంఘం సమావేశం కానుంది. 30వ దక్షిణాది జోనల్ కౌన్సిల్ సమావేశం... ఆగస్టులో జరిగే అవకాశం ఉంది. కేంద్ర హోంశాఖా మంత్రి అధ్యక్షతన జరగనున్న సమావేశానికి సంబంధించిన ఎజెండాను స్థాయీ సంఘం నేడు ఖరారు చేయనుంది. నేటి స్థాయీసంఘం సమావేశంలో... కేంద్ర హోంశాఖ అధికారులు, దక్షిణాది రాష్ట్రాల ఉన్నతాధికారులు పాల్గొననున్నారు.
2021 నవంబర్‌లో తిరుపతి వేదికగా జరిగిన 29వ జోనల్ కౌన్సిల్ సమావేశంలో... చర్చించిన అంశాలు, వాటిపై తీసుకున్న చర్యలు, కొత్తగా ప్రతిపాదినలపై... నేడు చర్చించనున్నారు. వాటన్నింటిని పరిగణనలోకి తీసుకొని... తదుపరి జోనల్ కౌన్సిల్ ఎజెండాను ఖరారు చేయనున్నారు. రాష్ట్రం నుంచి.. ఆర్థికశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు సమావేశానికి హాజరు కానున్నారు.
అంతర్ రాష్ట్ర నదీ జలవివాదాల ప్రకారం నీటివాటాల కోసం ట్రైబ్యునల్‌కు నివేదించడం, పోలవరం - పట్టిసీమ ద్వారా తరలిస్తున్న జలాలకు సంబంధించిన వాటా, ఆర్డీఎస్ ఆధునీకరణ, కృష్ణానదిపై ఏపీ, కర్నాటక చేపట్టిన అక్రమ ప్రాజెక్టులు, కాళేశ్వరంతో పాటు పాలమూరు - రంగారెడ్డి ప్రాజెక్టులకు జాతీయ హోదా అంశాలను ఎజెండాలో చేర్చాలని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించింది. గిరిజన విశ్వవిద్యాలయం ఏర్పాటు, ఉద్యాన విశ్వవిద్యాలయానికి నిధులు, ఉక్కు కర్మాగారం ఏర్పాటు, ఎన్టీపీసీ ఆధ్వర్యంలో 4000 మెగావాట్ల విద్యుత్ ప్లాంటు ఏర్పాటు, రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటు, రైల్వే, జాతీయ రహదార్ల నిర్మాణం, రెండు తెలుగు రాష్ట్రాల మధ్య ఆస్తులు, అప్పులు, బకాయిల పంపిణీ, పోలవరం ముంపు నుంచి తెలంగాణ ప్రాంతాల పరిరక్షణ తదితర అంశాలనూ ప్రతిపాదించింది.
ఇవీ చదవండి:తలసరి కరెంట్ వినియోగంలో దేశంలో అగ్రస్థానంలో నిలిచిన తెలంగాణ